
న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన సొల్యూషన్లు అందించే సుజ్లాన్ ఎనర్జీ రేటింగ్ రెండంచెలమేర మెరుగుపడింది. రేటింగ్ దిగ్గజం క్రిసిల్ తాజాగా సానుకూల ఔట్‌లుక్‌తో బీబీబీప్లస్/ఏ2కు అప్‌గ్రేడ్ చేసింది. ఇంతక్రితం బీబీబీమైనస్/ఏ3గా రేటింగ్ నమోదైంది.
కంపెనీ దీర్ఘకాలిక, స్వల్పకాలిక సౌకర్యాల రేటింగ్స్‌ను క్రిసిల్ ఎగువముఖంగా సవరించినట్లు సుజ్లాన్ ఎనర్జీ తెలియజేసింది. ఇది కంపెనీ అత్యుత్తమ నిర్వహణ సామర్థ్యంతోపాటు.. బలపడిన ఫైనాన్షియల్ పరిస్థితులను వెల్లడిస్తున్నట్లు సుజ్లాన్ గ్రూప్ సీఎఫ్‌వో హిమాన్షు మోడీ పేర్కొన్నారు.
పరిశ్రమసంబంధ సానుకూలతలు ఇందుకు జత కలిసినట్లు తెలియజేసింది. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా సమీకరించిన రూ. 2,000 కోట్లను కాలపరిమితి రుణాల పూర్తి చెల్లింపులకు వినియోగించడం రేటింగ్ సవరణలకు కారణమైనట్లు సుజ్లాన్ వెల్లడించింది. తద్వారా విజయవంతంగా రుణ భారాన్ని తగ్గించుకోగలిగినట్లు వివరించింది.