ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌.. పెరుగుతున్న డిమాండ్‌

Crisil Report: Commercial Leasing Space Growth Set To 10 To 15 Pc - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాణిజ్య లీజింగ్‌ కార్యకలాపాలు ఈ ఆర్థిక సంవత్సరంతోపాటు 2023–24లో సైతం 10–15 శాతం ఆరోగ్యకర వృద్ధిని సాధించే అవకాశం ఉందని క్రిసిల్‌ నివేదిక తెలిపింది. దీని ప్రకారం.. ఈ వృద్ధి రేటును అనుసరించి వాణిజ్య లీజింగ్‌ స్థలం 2022–23లో 2.8–3 కోట్ల చదరపు అడుగులను తాకుతుంది. ఆ తర్వాతి ఏడాది 3.1–3.3 కోట్ల చ.అడుగులకు పెరుగుతుంది. ఆఫీసుల నుంచి కార్యకలాపాలకు ఎక్కువ కంపెనీలు ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో డిమాండ్‌లో మెరుగుదల ఉంటుంది.

కమర్షియల్‌ రియల్టర్ల క్రెడిట్‌ ప్రొఫైల్స్‌ తగిన పరపతితో ఈ రెండేళ్లలో ఆరోగ్యంగా కొనసాగుతాయి. హైదరాబాద్‌సహా బెంగళూరు, చెన్నై, కోల్‌కత, ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 2022 మార్చి నాటికి 67 కోట్ల చ.అడుగుల గ్రేడ్‌–ఏ ఆఫీస్‌ స్పేస్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో వేగం పుంజుకున్న తర్వాత ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ అక్టోబర్‌–మార్చిలో తాత్కాలికంగా వెనక్కి తగ్గుతుంది. సానుకూల అంశాలు.. ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌లో 45 శాతం వాటా ఉన్న ఐటీ, ఐటీఈఎస్‌ విభాగంలో కొత్త ఉద్యోగుల చేరిక విషయంలో 2023–24లో సింగిల్‌ డిజిట్‌లో వృద్ధి నమోదు కానుంది.

30–50 శాతం ఉన్న ఆక్యుపెన్సీ మరింత పెరగనుంది. బీఎఫ్‌ఎస్‌ఐ, కన్సల్టింగ్, ఇంజనీరింగ్, ఫార్మా, ఈ–కామర్స్‌ విభాగాలు నూతనంగా ఆఫీస్‌ స్పేస్‌ను జతచేయనున్నాయి. ఆక్యుపెన్సీ 2022–23లో 84–85 శాతం వద్ద స్థిరపడవచ్చు. ఆసియా దేశాల్లోని పలు నగరాలతో పోలిస్తే భారత్‌లో అద్దె తక్కువ. ముంబైలో అద్దె చదరపు అడుగుకు రూ.130, బెంగళూరు 95, ఢిల్లీ ఎన్‌సీఆర్‌ 80 ఉంది. షాంఘై రూ.275, సియోల్‌ 200, మనీలా రూ.150 పలుకుతోంది. సింగపూర్‌ రూ.650, లండన్‌ 600, న్యూయార్క్, టోక్యో చెరి 550, హాంగ్‌కాంగ్‌ 500, సిడ్నీలో రూ.400 ఉంది.

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top