ఆటో అమ్మకాలకు లాక్‌డౌన్‌ బ్రేక్

Covid curbs brake auto sales in April - Sakshi

గతేడాది ఏప్రిల్‌లో అమ్మకాలు సున్నా 

ఈ మార్చితో పోలిస్తే తగ్గిన విక్రయాలు 

మారుతీ అమ్మకాల్లో 4% క్షీణత 

కోవిడ్‌ సంక్షోభంలోనూ పెరిగిన హోండా కార్స్, ఎంఅండ్‌ఎం అమ్మకాలు  

ముంబై: రెండో దశ కరోనా ప్రేరేపిత స్థానిక లాక్‌డౌన్‌లు వాహన విక్రయాలకు తీవ్ర విఘాతాన్ని కలిగించాయి. దీంతో ఏప్రిల్‌ నెలలో ఆటో అమ్మకాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. కోవిడ్‌ కట్టడికి మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు స్థానిక లాక్‌డౌన్‌లు విధించాయి. మిగతా రాష్ట్రాల్లోనూ రాత్రి కర్ఫ్యూ ఆంక్షలు అమలవుతున్నాయి. ఫలితంగా ఆటో పరిశ్రమలో సరఫరా అవాంతరాలు నెలకొని అమ్మకాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. దేశవ్యాప్త సంపూర్ణ లాక్‌డౌన్‌ విధింపుతో గతేడాది ఏప్రిల్‌లో వాహన కంపెనీలేవీ ఒక్క వాహనాన్ని కూడా విక్రయించలేదు. అందువల్ల నాటి అమ్మకాలతో ఈ ఏప్రిల్‌ విక్రయాలను పోల్చిచూడలేమని ఆటో కంపెనీలు చెప్పుకొచ్చాయి. కావున ఈ ఏడాది మార్చి అమ్మకాలతో పోల్చిచూడగా..,   

మారుతీ సుజుకీ ఏప్రిల్‌లో మొత్తం 1,59,691 వాహనాలను విక్రయించింది. ఈ మార్చిలో విక్రయించిన 1,67,014 వాహనాలతో పోలిస్తే 4 శాతం తక్కువ. హ్యుందాయ్‌ మోటార్స్‌ ఇండియా నెల ప్రాతిపదికన ఈ ఏప్రిల్‌లో 8 శాతం క్షీణత చవిచూసినట్లు ప్రకటించింది. మార్చిలో 64,621 యూనిట్లను విక్రయించగా, ఏప్రిల్‌ అమ్మకాలు 59,203 యూనిట్లుగా ఉన్నాయి. ‘‘కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా మా కార్యకలాపాలను కొనసాగిస్తున్నాము. కఠిన ఆంక్షలను ప్రణాళిక బద్ధంగా ఎదుర్కొంటూనే కంపెనీ ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరిపింది’’ అని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ గార్గ్‌ తెలిపారు.  

  • ఇదే ఏప్రిల్‌లో టాటా మోటార్స్‌ కంపెనీ మొత్తం 25,095 ప్యాసింజర్‌ వాహనాలను విక్రయించింది. మార్చి నెలలో అమ్ముడైన 29,654 యూని ట్లతో పోలిస్తే అమ్మకాలు 15 శాతం తక్కువ.  
  • ఏప్రిల్‌లో టయోటా కిర్లోస్కర్‌ మోటార్స్‌ 9,622 వాహనాలను విక్రయించింది. కియా ఇండియా 16,111, ఎంజీ మోటార్‌ ఇండియా 2,565 చొప్పున వాహనాలను విక్రయించాయి. 

హోండా కార్స్, ఎంఅండ్‌ఎం అమ్మకాల్లో వృద్ధి
కరోనా సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటూనే హోండా కార్స్‌ ఇండియా కార్ల అమ్మకాలు 28 శాతం పెరిగి 9,072 వాహనాలుగా నమోదయ్యాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ అమ్మకాలు సైతం పెరిగాయి. మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో మహీంద్రా అండ్‌ మహీంద్రా అమ్మకాలు 9 శాతం వృద్ధి చెంది 18,285 వాహనాలు అమ్ముడయ్యాయి.

చదవండి:

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top