రిలయన్స్‌కు షాకిచ్చిన బ్రోకరేజ్‌లు

CLSA, Edelweiss downgrade Reliance Industries - Sakshi

రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసిన సీఎల్‌ఎస్‌ఏ, ఎడెల్వీజ్‌ సంస్థలు

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలైన సీఎల్‌ఎస్‌ఏ, ఎడెల్వీజ్‌లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు షాక్‌నిచ్చాయి. నిఫ్టీ ఇండెక్స్‌ను ముందుండి నడిపిస్తున్న రిలయన్స్‌ షేరుకు డౌన్‌గ్రేడ్‌ రేటింగ్‌ను కేటాయించాయి. మార్చి కనిష్టస్థాయి రూ.867.82 నుంచి రిలయన్స్‌ షేరు 150శాతం ర్యాలీ చేసి ఇటీవల రూ.2000 స్థాయిని అందుకుంది. ‘‘నిధుల సమీకరణ, రుణాన్ని తగ్గించుకోవడం, వ్యాపారాల వాల్యూ అన్‌లాక్‌ కావడంతో షేరు అధికంగా ర్యాలీ చేసింది. వాల్యూయేషన్లు అధికంగా ఉన్నాయి. ఈ పరిణామాలు అప్రమత్తతకు సంకేతాలు’’ అని రెండు బ్రోకరేజ్‌ సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఇప్పుడు రిలయన్స్‌ షేరుపై ఆయా బ్రోకరేజ్‌ సంస్థల విశ్లేషణలను చూద్దాం...

ఎడెల్వీజ్‌ బ్రోకరేజ్‌: రిలయన్స్‌ షేరుకు ‘‘హోల్డ్‌’’ రేటింగ్‌ను కేటాయించింది. టార్గెట్‌ ధరను రూ.2105గా నిర్ణయించింది. రుణాలను తగ్గించుకోవడం, అసెట్‌ మోనిటైజేషన్‌, వ్యాపారంలో డిజిటల్‌ మూమెంట్‌ తదితర అంశాలు షేరును రూ.2000స్థాయిని అందుకునేందుకు తోడ్పడినట్లు ఎడెల్వీజ్‌ బ్రోకరేజ్‌ తెలిపింది. రిలయన్స్‌ షేరు ఏడాది ప్రైజ్‌ -టు -ఎర్నింగ్స్‌ 47.2రెట్ల నిష్పత్తి వద్ద ట్రేడ్‌ అవుతోందని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. ఈ విలువ వాస్తవ విలువ కంటే అధికంగా ఉందని తెలిపింది. షేరు ధర పతనం ఒక క్రమపద్ధతిలో ఉంటుందని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. ఈ బ్రోకరేజ్‌ సంస్థ 2016 నుంచి రిలయన్స్‌ షేరుపై పాజిటివ్‌గానే ఉంది. ఈ 4ఏళ్లలో షేరు 400శాతం ర్యాలీ చేసింది. 

సీఎల్‌ఎస్‌ఏ బ్రోకరేజ్‌: రిలయన్స్‌ షేరు రేటింగ్‌ను ‘‘అవుట్‌ఫెర్‌ఫామ్‌’’ నుంచి ‘‘బై’’కు కుదించింది. అయితే టార్గెట్‌ ధరను మాత్రం రూ.2,250కి పెంచింది. ఈ టార్గెట్‌ ధర షేరు ప్రస్తుత ధరకు అతి దగ్గరలో ఉంది. మార్చి 2022 నాటికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 220 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తుంది. అయితే షేరు ర్యాలీ స్వల్పకాలంలో ఆగిపోతుందని విశ్వసిస్తుంది. గడిచిన 4ఏళ్లలో షేరు 400శాతానికి పైగా ర్యాలీ చేసింది. 4నెలల్లో 150శాతం ర్యాలీ చేసింది. ఇప్పుడు స్టాక్‌ ర్యాలీ కొంతకాలం పాటు ఆగిపోవచ్చని సీఎల్‌ఎస్‌ఏ తన నివేదికలో తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top