
సెన్సెక్స్ 156 పాయింట్లు డౌన్..
ముంబై: భారత్ – పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 156 పాయింట్లు నష్టపోయి 80,641 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 82 పాయింట్లు పతనమై 24,380 వద్ద నిలిచింది. ఉదయం సూచీలు సానుకూలంగా మొదలయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయాలు, యూఎస్–చైనా వాణిజ్య చర్చల నేపథ్యంలో పరిమిత శ్రేణిలో ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 316 పాయింట్లు క్షీణించి 80,481 వద్ద, నిఫ్టీ 130 పాయింట్లు పతనమై 24,331 వద్ద కనిష్టాన్ని తాకాయి. ఫెడ్ వడ్డీరేట్ల కోత ఉండకపోవచ్చనే అంచనాలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
⇒ ఆటో, టెక్ మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. బీఎస్‌ఈలో రంగాల వారీగా సూచీల్లో రియల్టీ 3.5%, విద్యుత్, సర్వీసెస్ 2.5%, యుటిలిటీ, ఇండస్ట్రీయల్, క్యాపిటల్ గూడ్స్ 2%, కన్జూమర్ డ్యూరబుల్స్ ఒకటిన్నర శాతం నష్టపోయాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 2%కి పైగా క్షీణించాయి.