చిలుకూరు ఆలయంపై అమెరికా సెనేటర్ వివాదాస్పద వ్యాఖ్యలు | Chilkur Balaji Temple US Senator Eric Schmitt Visa Cartel comments | Sakshi
Sakshi News home page

చిలుకూరు ఆలయంపై అమెరికా సెనేటర్ వివాదాస్పద వ్యాఖ్యలు

May 15 2026 4:16 AM | Updated on May 15 2026 5:25 AM

Chilkur Balaji Temple US Senator Eric Schmitt Visa Cartel comments

హైదరాబాద్‌లోని చిలుకూరు బాలాజీ ఆలయంపై అమెరికా సెనేటర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా హెచ్-1బీ వీసా కార్యక్రమంపై విమర్శలు గుప్పించిన అమెరికా రిపబ్లికన్ సెనేటర్ ఎరిక్ ష్మిత్‌ చిలుకూరు బాలాజీ టెంపుల్‌ను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.

మిస్సౌరీకి చెందిన సెనేటర్ ఎరిక్ ష్మిత్‌, ఎక్స్ (X) వేదికగా వరుస పోస్టులు చేస్తూ అమెరికా ఉపాధి ఆధారిత వీసా విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. హెచ్-1బీ, ఎల్-1, ఎఫ్-1, అలాగే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) వంటి వీసా కార్యక్రమాలు అమెరికన్ మధ్యతరగతి ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ వ్యవస్థ స్థానిక వేతనాలను తగ్గిస్తూ, అమెరికన్ ఉద్యోగులను పక్కన పెట్టే “గ్లోబల్ వీసా కార్టెల్”గా మారిందని పేర్కొన్నారు.

“అమెరికన్ పన్ను చెల్లింపుదారుల సబ్సిడీలతో బిలియన్ల డాలర్లు ఇప్పుడు భారతదేశానికి ప్రవహిస్తున్నాయి. అవి అమెరికన్లకు కాకుండా విదేశీ కార్మికుల శిక్షణకు ఉపయోగపడుతున్నాయి” అని ఆయన తన పోస్టులో వ్యాఖ్యానించారు. తన వాదనకు ఉదాహరణగా చిలుకూర్ బాలాజీ ఆలయ చిత్రాన్ని షేర్‌ చేసిన ష్మిత్‌, దీనిని “వీసా టెంపుల్”గా అభివర్ణించారు. అమెరికా వర్క్ వీసాల కోసం వేలాది మంది భారతీయులు ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ, పాస్‌పోర్ట్‌లకు ఆశీర్వాదాలు పొందుతారని ఆయన పేర్కొన్నారు.

“హైదరాబాద్‌లో ‘వీసా కార్టెల్’కు సొంతంగా ఒక వీసా దేవాలయం కూడా ఉంది. అక్కడ యూఎస్ వర్క్ వీసాల కోసం ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. అమెరికన్ కార్మికులు ఇలాంటి వ్యవస్థతో పోటీ పడాల్సిన అవసరం లేదు” అని ఆయన తన పోస్టులో రాసుకొచ్చారు.

ఇక విదేశీ విద్యార్థుల్లో దాదాపు సగం మంది భారతీయులేనని, వారికి పన్ను చెల్లింపుదారుల సబ్సిడీతో వర్క్ పర్మిట్లు లభిస్తున్నాయని ష్మిత్‌ ఆరోపించారు. “వారు తర్వాత హెచ్-1బీ, గ్రీన్ కార్డుల వైపు వెళ్తుంటే, భారీ విద్యారుణాలతో ఉన్న అమెరికన్ గ్రాడ్యుయేట్లు చౌకైన కార్మికులతో పోటీ పడాల్సి వస్తోంది” అని వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా, భారతీయ వీసా హోల్డర్లు వీసా ఇంటర్వ్యూలలో అడిగే ప్రశ్నలను పరస్పరం పంచుకుంటారని, పెద్ద టెక్ కంపెనీలు ఈ వీసా వ్యవస్థల ద్వారా అమెరికన్ ఉద్యోగాలను మళ్లిస్తున్నాయని కూడా ఆయన ఆరోపించారు. “మెరిట్ స్థానంలో ఇప్పుడు జాతి ఆధారిత ప్రాధాన్యత చోటు చేసుకుంది” అని ఆయన అన్నారు.

ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లోని చిలుకూర్ బాలాజీ ఆలయం ఎన్నో ఏళ్లుగా “వీసా దేవాలయం”గా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు వీసా ఇంటర్వ్యూలకు ముందు ఈ ఆలయాన్ని దర్శించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

కాగా, అమెరికా హెచ్-1బీ వీసా ఆమోదాల్లో భారతీయుల ఆధిపత్యం కొనసాగుతోంది. మొత్తం హెచ్-1బీ వీసాల్లో 70 నుంచి 80 శాతం వరకు భారతీయులకే లభిస్తుండగా, చైనా వాటా సుమారు 12 శాతంగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement