Central Govt, Government Planned To Implement VRS In These Bank Employees - Sakshi
Sakshi News home page

ఆ బ్యాంకు ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌..

Published Wed, Jun 9 2021 8:44 AM

Central Govt  Planned To Implement VRS In These Banks To Attract Investors - Sakshi

న్యూఢిల్లీ: ప్రైవేటీకరణ జాబితాలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో(పీఎస్‌బీ) ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) పథకం అమలు అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆకర్షణీయమైన ప్యాకేజీ అమలు చేయడం ద్వారా సిబ్బంది సంఖ్యను తగ్గించగలిగితే .. బ్యాంకింగ్‌ రంగంలోకి ప్రవేశించాలనుకునే ప్రైవేట్‌ సంస్థలు వాటిని టేకోవర్‌ చేసేందుకు మరింత ఆసక్తి చూపవచ్చని భావిస్తోంది.

ఆప్షనల్‌ వీఆర్‌ఎస్‌ 
వీఆర్‌ఎస్‌ అనేది ఉద్యోగులకు ఐచ్ఛికంగా ఉంటుందే తప్ప బలవంతంగా సాగనంపే కార్యక్రమం కాదని సంబంధిత వర్గాలు తెలిపాయి. మంచి ప్యాకేజీ లభిస్తే ముందస్తుగా రిటైర్‌ కావాలనుకునే వారికి ఇది ఆకర్షణీయంగా ఉండగలదని వివరించాయి. కొన్ని పీఎస్‌బీల విలీనం సందర్భంగా గతంలోనూ ఇలాంటి పథకాలు అమలు చేసినట్లు పేర్కొన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు పీఎస్‌బీలు, ఒక సాధారణ బీమా కంపెనీని ప్రైవేటీకరించే యోచనలో ఉన్నట్లు 2021–22 బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. 

లిస్టులో సెంట్రల్‌ బ్యాంక్, ఐవోబీ.. 
ప్రైవేటీకరించే పీఎస్‌బీలను గుర్తించే బాధ్యతను తీసుకున్న నీతి ఆయోగ్‌.. ఇటీవలే కొన్ని పేర్లను క్యాబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా సారథ్యంలోని అత్యున్నత స్థాయి కమిటీకి (సీజీఎస్‌) సిఫార్సు చేసింది. ఈ లిస్టులో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వంటివి ఉన్నాయి. ప్రధానంగా సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
 

చదవండి: నిధుల సేకరణకు బ్యాంకులు బలి

Advertisement
Advertisement