ఆమ్రపాలి సిలికాన్‌ సిటీపై సీబీఐ కేసు

Cbi Case On Amrapali City For Rs 177 Crore Bank Fraud - Sakshi

న్యూఢిల్లీ: బ్యాంక్‌లను రూ.177 కోట్లకు మోసగించిన ఆరోపణలపై ఆమ్రపాలి సిలికాన్‌ సిటీ ప్రైవేటు లిమిటెడ్, దాని ప్రమోటర్‌ అనిల్‌కుమార్‌ శర్మపై సీబీఐ మోసపూరిత కేసు దాఖలు చేసింది. అనంతరం ఢిల్లీ, నోయిడాలోని ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఆమ్రపాలి సిలికాన్‌ సిటీ తమను మోసగించినట్టు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ ఈ చర్యలు తీసుకుంది. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌తో కూడిన బ్యాంక్‌ల కన్సార్షియానికి లీడ్‌ బ్యాంక్‌గా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఉంది. దీంతో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సీబీఐకి ఫిర్యాదు చేసింది.

ఢిల్లీ సబర్బన్‌ ప్రాంతంలోని అమ్రపాలి సిలికాన్‌ సిటీలో గ్రూపు హౌసింగ్‌ కాంప్లెక్స్‌ అభివృద్ధికి వీలుగా ఆమ్రపాలీ సిలికాన్‌ సిటీ ప్రైవేటు లిమిటెడ్‌ 1.76 లక్షల చదరపు మీటర్ల భూమిని, న్యూ ఓక్లా ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ నుంచి తీసుకుంది. ఇందులో నిర్మించిన 468 ఫ్లాట్లను చాలా తక్కువ ధరకు, అది కూడా నిర్మాణ వ్యయానికంటే తక్కువకే కంపెనీ విక్రయించింది. నిర్మాణ వ్యయానికంటే తక్కువకు విక్రయించడం ద్వారా రూ.73 కోట్లను కంపెనీ దారిమళ్లించినట్టు ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో తేలింది. అలాగే, ఇళ్ల కొనుగోలుదారుల నుంచి తీసుకున్న రూ.303 కోట్లను గ్రూపు కంపెనీలకు దారిమళ్లించిన విషయం కూడా వెలుగు చూసింది. దీంతో ఆమ్రపాలి సిలికాన్‌ సిటీ రుణం విషయంలో ఫోర్జరీ, తప్పుదారి పట్టించడం ద్వారా రూ.177 కోట్ల మేరకు మోసం చేసినట్టు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఆరోపించింది.

చదవండి: మామూలు లక్‌ కాదండోయ్‌, సంవత్సరంలో రూ.లక్ష పెట్టుబడితో రూ.20 లక్షలు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top