పార్లమెంట్‌లో నేడు ‘సీఏపీఎఫ్‌ బిల్లు-2026’ | Amit Shah Introduces CAPF General Admin Bill 2026 In Rajya Sabha To Reform Promotions, Deputations And IPS Cadre Management | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌లో నేడు ‘సీఏపీఎఫ్‌ బిల్లు-2026’

Mar 23 2026 9:14 AM | Updated on Mar 23 2026 10:20 AM

CAPF General Admin Bill 2026 Rajya Sabha Cadre Reforms IPS Deputation

దేశ అంతర్గత భద్రతలో కీలకమైన కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్‌) నిర్వహణలో కీలక మార్పులు లక్ష్యంగా రూపొందించిన ‘కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సాధారణ పరిపాలన) బిల్లు-2026’ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఐపీఎస్ అధికారుల డిప్యుటేషన్, క్యాడర్ సంస్కరణలపై చర్చ జరుగుతున్న తరుణంలో ఈ బిల్లు ప్రాధాన్యత సంతరించుకుంది.

ఏకీకృత చట్టం.. లక్ష్యం ఇదే!

ప్రస్తుతం సీఆర్‌పీఎప్‌, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్‌బీ వంటి దళాలు వేర్వేరు చట్టాల ద్వారా నడుస్తున్నాయి. దీనివల్ల నియామకాలు, పదోన్నతులు, సేవా నిబంధనల్లో వ్యత్యాసాలు ఉండి పరిపాలనాపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను తొలగించి సుమారు 10 లక్షల మంది సిబ్బంది ఉన్న ఈ దళాలన్నింటికీ ఒకే విధమైన చట్టపరమైన చట్రాన్ని తీసుకురావడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం.

బిల్లులోని కీలక అంశాలు

  • అధికారుల నియామకం, పదోన్నతి, డిప్యుటేషన్లపై నిబంధనలు రూపొందించే పూర్తి అధికారం కేంద్రానికి ఉంటుంది. అవసరమైతే ఇతర చట్టాలను ఇది నియంత్రించవచ్చు.

  • అత్యున్నత స్థాయి పదవుల్లో ఐపీఎస్ అధికారుల ప్రాబల్యాన్ని ఈ బిల్లు చట్టబద్ధం చేస్తోంది.

  • ఐజీ స్థాయిలో.. 50 శాతం పోస్టులు ఐపీఎస్ డిప్యుటేషన్ ద్వారా భర్తీ.

  • ఏడీజీ స్థాయిలో.. కనీసం 67 శాతం పోస్టులు ఐపీఎస్ అధికారులకే.

  • స్పెషల్ డైరెక్టర్ జనరల్, డైరెక్టర్ జనరల్ పదవులన్నీ పూర్తిగా డిప్యుటేషన్ ద్వారానే భర్తీ అవుతాయి.

కోర్టు తీర్పుకు విరుద్ధమా?

మే 2025లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ బిల్లు వివాదాస్పదంగా మారింది. సీఏపీఎఫ్ అధికారులను ‘ఆర్గనైజ్డ్ గ్రూప్-A సర్వీస్’గా గుర్తించిన అత్యున్నత న్యాయస్థానం, ఉన్నత స్థాయిల్లో ఐపీఎస్ అధికారుల డిప్యుటేషన్‌ను క్రమంగా తగ్గించాలని, క్యాడర్ రివ్యూ చేపట్టాలని ఆదేశించింది. అక్టోబర్ 2025లో కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. తాజాగా ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు కోర్టు ఆదేశాలను నీరుగార్చేలా ఉందని మాజీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిరసనలు

బిల్లులోని నిబంధనలపై మాజీ సీఏపీఎఫ్ అధికారులు తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నారు. హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయడంతో పాటు ఈ బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపాలని డిమాండ్ చేస్తున్నారు. ‘ఐపీఎస్ అధికారుల లేటరల్‌ ప్రవేశం వల్ల సొంత క్యాడర్ అధికారుల పదోన్నతులు నిలిచిపోతున్నాయి. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పని చేసే జవాన్లకు స్పష్టమైన కెరీర్ వృద్ధి ఉండాలి. నాయకత్వ బాధ్యతల్లో అంతర్గత అధికారులకు ప్రాధాన్యత ఇస్తేనే క్షేత్రస్థాయి నిర్ణయాలు సమర్థవంతంగా ఉంటాయి’ అని హెచ్.ఆర్. సింగ్, ఎస్.కె. సూద్ (రిటైర్డ్ అధికారులు) చెబుతున్నారు.

కేంద్రం వాదన

రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ పనిచేసే కేంద్ర దళాల స్వభావాన్ని కాపాడాలంటే ఐపీఎస్ అధికారుల డిప్యుటేషన్లు అత్యవసరమని కేంద్రం వాదిస్తోంది. ఈ కొత్త చట్టం వల్ల నిబంధనల్లో స్పష్టత వస్తుందని, అనవసరమైన లిటిగేషన్లు తగ్గి పరిపాలనా సామర్థ్యం పెరుగుతుందని హోం శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. నేడు రాజ్యసభలో ఈ బిల్లుపై చర్చ జరగనుంది. కోర్టు తీర్పులను అధిగమిస్తూ కేంద్రం తీసుకువస్తున్న ఈ నిబంధనలపై విపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.

ఇదీ చదవండి: మీ డబ్బు మీ కోసం పనిచేస్తుందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement