స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్టర్ల సంఖ్య 8 కోట్లు, ఫ్రాన్స్‌ను వెనక్కి నెట్టిన భారత్‌

Bse Registered Investors Cross 8 Crore Mark  - Sakshi

ముంబై: స్టాక్‌ ఎక్ఛేంజీ దిగ్గజం బీఎస్‌ఈ ప్లాట్‌ఫామ్‌పై లావాదేవీలు నిర్వహించే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో రిజిస్టర్డ్‌ ఇన్వెస్టర్ల ఖాతాలు ఇటీవల కోటి జమయ్యాయి. దీంతో వీటి సంఖ్య తాజాగా 8 కోట్లకు చేరాయి. 107 రోజుల్లో అంటే జూన్‌ 6– సెప్టెంబర్‌ 21 మధ్య కోటి ఖాతాలు జత కలసినట్లు బీఎస్‌ఈ ఎండీ, సీఈవో ఆశిష్‌కుమార్‌ చౌహాన్‌ తాజాగా పేర్కొన్నారు.

ఈ ఏడాది జూన్‌ 6కల్లా లావాదేవీలు నిర్వహిస్తున్న వినియోగదారుల సంఖ్య 7 కోట్లను తాకినట్లు బీఎస్‌ఈ ఇంతక్రితం వెల్లడించింది. ఇందుకు 12 నెలల్లో అంటే 2020 మే 23 నుంచి 2 కోట్ల ఖాతాలు జమకావడం కారణమైనట్లు తెలియజేసింది. ఇటీవల ఈ స్పీడ్‌ మరింత పెరగడంతో రిజిస్టర్డ్‌ ఇన్వెస్టర్ల ఖాతాల సంఖ్య తాజాగా 8 కోట్ల మార్క్‌ను అధిగమించినట్లు ఆశిష్‌ వివరించారు.

ఇందుకు ప్రధానంగా రిటైల్‌ ఇన్వెస్టర్లు పెరగడం దోహదపడినట్లు తెలియజేశారు. గత ఏడాదిన్నర కాలంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ ద్వారా లేదా ప్రత్యక్షంగా ఈక్విటీ పెట్టుబడులు జోరందుకున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇందుకు ప్రపంచవ్యాప్తంగా పలు అంశాలు ప్రభావం చూపుతున్నట్లు పేర్కొన్నారు. దేశీ స్టాక్‌ మార్కెట్లలోనూ ఈ ట్రెండ్‌ కొనసాగుతున్నట్లు తెలియజేశారు. అయితే మార్కెట్లలోకి ప్రవేశించేముందు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉన్నట్లు సూచిం చారు. పెట్టుబడులకు దిగేముందు కంపెనీలు, విధానాలు, అవకాశాలు తదితర అంశాలను అర్ధం చేసుకోవలసి ఉంటుందని సలహా ఇచ్చారు.    

తొలినాళ్లలో ఇలా..
2008 ఫిబ్రవరిలో బీఎస్‌ఈ కోటి మంది ఇన్వెస్టర్ల మైలురాయిని చేరుకున్నట్లు బీఎస్‌ఈ ఎండీ, సీఈవో ఆశిష్‌కుమార్‌ చౌహాన్‌ ప్రస్తావించారు. ఆపై 2011 జులైకల్లా ఈ సంఖ్య 2 కోట్లను తాకిందని చెప్పారు. ఈ బాటలో 3 కోట్ల మార్క్‌కు మరో మూడేళ్లు పట్టగా..అంటే 2014 జనవరికల్లా చేరగా.. 2018 ఆగస్ట్‌లో 4 కోట్లను అందుకున్నట్లు తెలియజేశారు. 

2020 మే నెలలో 5 కోట్లను తాకగా.. 2021 జనవరి 19న 6 కోట్లకు చేరింది. కాగా.. కోవిడ్‌–19 మహమ్మారి తలెత్తడంతో 2020 మార్చిలో ఉన్నట్టుండి కుప్పకూలిన మార్కెట్లు ఆపై బుల్‌ ర్యాలీ బాట పట్టిన విషయం విదితమే. ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 110 శాతం దూసుకెళ్లి ఏకంగా 59,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. మార్చి కనిష్టం 26,000 పాయింట్ల నుంచి చూస్తే 127 శాతం పురోగమించింది. ఈ ర్యాలీలో భాగంగా 2021 జనవరిలో సెన్సెక్స్‌ తొలుత 50,000 పాయింట్ల మైలురాయిని చేరుకుంది.

ఈ స్పీడ్‌ కొనసాగడంతో ఒక్క ఆగస్ట్‌లోనే 4,000 పాయింట్లు కలుపుకుని 57,000 పాయింట్లకు చేరింది. తదుపరి ఆగస్ట్‌ 31– సెప్టెంబర్‌ 3 మధ్య కేవలం మూడు రోజుల్లోనే 1,000 పాయింట్లు జంప్‌చేసింది. ఆపై మరో 8 రోజుల్లో అంటే ఈ నెల 16కల్లా మరో 1,000 పాయింట్లు జమ చేసుకుని 59,000నూ దాటేసింది! ఫలితంగా మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ) తొలిసారి 3.54 ట్రిలియన్‌ డాలర్లు లేదా రూ. 260.78 లక్షల కోట్లకు చేరింది. వెరసి ప్రపంచంలోనే అత్యంత విలువైన మార్కెట్లలో ఫ్రాన్స్‌ను వెనక్కి నెట్టి ఆరో ర్యాంకులో నిలిచింది!! 

చదవండి: ఐపీవోలతో స్టాక్‌ మార్కెట్‌ స్పీడు, అత్యంత సంపన్న దేశం దిశగా భారత్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top