దివాలా, రుణ పరిష్కార చట్టం (ఐబీసీ)లోని లొసుగులను అడ్డు పెట్టుకునే మొండి బకాయిదారుల తీరుపై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టాన్ని రక్షణ కవచంగా వాడుకుంటూ అప్పులు ఎగ్గొట్టే ధోరణి దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని న్యాయస్థానం హెచ్చరించింది. జస్టిస్ మనీష్ పితాలే, జస్టిస్ శ్రీరామ్ శిర్సత్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఏమిటీ ఆందోళనకర ధోరణి?
రుణ ఎగవేతదారులు అనుసరిస్తున్న వ్యూహాలను కోర్టు ‘డిస్టర్బింగ్ ట్రెండ్’(ఆందోళనకర ధోరణి)గా అభివర్ణించింది. సాధారణంగా బ్యాంకులు తాకట్టు పెట్టిన ఆస్తులను రికవరీ చేయడానికి ‘సర్ఫేసీ’ (SARFAESI) చట్టం కింద వేలం ప్రక్రియ చేపడతాయి. అయితే, ఈ ప్రక్రియ ముగిసి వేలంలో ఆస్తులు కొనుగోలు చేసిన వారు రంగంలోకి వచ్చే వరకు నిమ్మకు నీరెత్తినట్లు ఉండే డిఫాల్టర్లు చివరి నిమిషంలో ఎన్‌సీఎల్‌టీని(వివాద పరిష్కారాల ట్రిబ్యునల్) ఆశ్రయిస్తున్నారు.
‘ఐబీసీ కింద తప్పుడు మార్గాల్లో మొరటోరియం(చట్టబద్ధంగా కొంతకాలం పాటు వేలం వాయిదా వేయడం) పొందడం ద్వారా వారు అప్పటివరకు జరిగిన చట్టబద్ధమైన వేలం ప్రక్రియను స్తంభింపజేస్తున్నారు. ఇది కేవలం న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడమే కాకుండా దేశ వ్యాపార వాతావరణాన్ని దెబ్బతీస్తుంది’ అని బాంబే హైకోర్టు తెలిపింది. ‘కొన్ని సంస్థల తీరువల్ల ఐబీసీ లక్ష్యం దెబ్బతింటోంది. ఐబీసీ అసలు ఉద్దేశం రుణ పరిష్కారం, కానీ ఇక్కడ అది రికవరీని అడ్డుకోవడానికి వాడుతున్నారు. ఇటువంటి చర్యలు బ్యాంకుల ఆర్థిక ఆరోగ్యాన్ని, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి. నిజాయితీ గల రుణదాతల హక్కులను కాపాడటంలో కఠినంగా వ్యవహరించాలి’ అని చెప్పింది.
కేసు నేపథ్యం ఇదే..
రోజినా ఫిరోజ్ హజియాని, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక సంస్థ రూ.6.25 కోట్ల రుణ సౌకర్యాన్ని పొందింది. అప్పు చెల్లించకపోవడంతో బ్యాంకు ముంబైలోని తాకట్టు ఆస్తిని స్వాధీనం చేసుకుని వేలం వేసింది. వేలం ప్రక్రియ పూర్తయి పిటిషనర్లు ఆ ఆస్తిని కొనుగోలు చేసిన తర్వాత.. సదరు రుణగ్రహీతలు ఒక్కసారిగా ఐబీసీని తెరపైకి తెచ్చి ఎన్‌సీఎల్‌టీ ద్వారా స్టే పొందారు. డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్‌టీ) సేల్ రిజిస్ట్రేషన్‌ను నిలిపివేసింది. దీన్ని సవాలు చేస్తూ కొనుగోలుదారులు హైకోర్టును ఆశ్రయించారు.
దేశంలో మొండి బకాయిల వసూలు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన బలమైన ఆయుధం ఐబీసీ. అయితే, కొందరు విల్‌ఫుడ్ డిఫాల్టర్లు(ఉద్దేశపూర్వక ఎగవేతదారులు) దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుని బ్యాంకుల చేతులు కట్టేస్తున్నారు. బాంబే హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు చట్టంలోని లొసుగులను వాడుకుని కాలయాపన చేసే వారికి గట్టి హెచ్చరిక. ఇది భవిష్యత్తులో వేలం కొనుగోలుదారులకు భరోసానివ్వడమే కాకుండా బ్యాంకింగ్ రంగంలో క్రమశిక్షణను పెంచుతుంది.
ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!


