
భారతదేశంలో ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో చాలామంది ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో లక్ష రూపాయల కంటే తక్కువ ధరలో లభించే.. అధిక మైలేజ్ ఇచ్చే స్కూటర్లను గురించి తెలుసుకుందాం.
టీవీఎస్ జుపీటర్ 125 (TVS Jupiter 125)
మార్కెట్లో అధిక అమ్మకాలను పొందుతూ.. ఎందోమందిని ఆకర్షిస్తున్న టీవీఎస్ జుపీటర్ 125 ఎక్కువ మైలేజ్ ఇచ్చే స్కూటర్ల జాబితాలో ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 96000 (ఎక్స్ షోరూమ్). ఇది 60 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ 124.8 సీసీ ఇంజిన్ ద్వారా 8.15 Bhp పవర్, 10.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇందులో స్టోరేజ్ స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ప్రత్యేకించి రోజువారీ వినియోగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
యమహా ఫాసినో 125 (Yamaha Fascino 125)
రూ.79990 ప్రారంభ ధర వద్ద లభించే యమహా ఫాసినో 125 సీసీ ఇంజన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది. కాబట్టి ఇది పెట్రోల్, విద్యుత్ రెండింటిలోనూ నడుస్తుంది. ఇది 66 కిమీ / లీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇది మంచి డిజైన్, రైడర్లకు కావలసిన ఫీచర్స్ పొందుతుంది.
ఇదీ చదవండి: రూ. 22.95 లక్షల బీఎండబ్ల్యూ బైక్
హోండా యాక్టివా 6జీ (Honda Activa 6G)
భారతదేశంలో యాక్టివా 6జీ అనేది హోండా మోటార్‌సైకిల్ బెస్ట్ సెల్లింగ్ స్కూటర్‌లలో ఒకటిగా ఉంది. ఇది 109.51 సీసీ ఇంజిన్ ద్వారా 7.73 Bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కూటర్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్లు. దీని టాప్ స్పీడ్ గంటకు 85 కిమీ. 106 కేజీల బరువున్న ఈ స్కూటర్ 60 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ ధర రూ. 78000 నుంచి రూ. 84000 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది.