హ‌మ్మ‌య్యా!! బ్యాంక్ రుణాలు రిక‌వ‌రీ అవ్వ‌నున్నాయ్‌, కార‌ణం ఇదే?! | Sakshi
Sakshi News home page

హ‌మ్మ‌య్యా!! బ్యాంక్ రుణాలు రిక‌వ‌రీ అవ్వ‌నున్నాయ్‌, కార‌ణం ఇదే?!

Published Fri, Feb 18 2022 11:13 AM

Banking Sector Outlook Revised To Improving For Fy23 Says India Ratings - Sakshi

ఇదిలాఉండగా, భారత్‌ బ్యాంకింగ్‌ అవుట్‌లుక్‌ 2022–23 ఆర్థిక సంవత్సరంలో మెరుగుపడే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. పటిష్ట రుణ డిమాండ్, బ్యాలన్స్‌ షీట్స్‌ అంచనాలు తమ విశ్లేషణకు కారణమని తెలిపింది. 

బ్యాంకింగ్‌ రుణ వృద్ధి 10 శాతంగా నమోదయ్యే వీలుందని కూడా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ రేటును 8.4 శాతంగా అభిప్రాయపడింది. రుణాల్లో స్థూల మొండి బకాయిల నిష్పత్తి 6.1 శాతంగా ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు తగిన మూలధన నిల్వలు అందుబాటులో ఉంటాయని అభిప్రాయపడింది. 

అన్ని రంగాల్లో వృద్ధి, మౌలిక రంగంలో ప్రభుత్వ వ్యయాలు పెరగడం వంటి అంశాల నేపథ్యంలో రుణ రికవరీలు కూడా మెరుపడే వీలుందని తెలిపింది. ఇక రుణాలు, డిపాజిట్ల విషయంలో దిగ్గజ ప్రైవేటు బ్యాంకుల మార్కెట్‌ వాటా పెరుగుతుందని అంచనా వేసింది. మూలధనం, పోర్ట్‌ఫోలియో నిర్వహణల విషయంలో ప్రైవేటు బ్యాంకులు మంచి పనితీరును కనబరిచే అవకాశం ఉందని విశ్లేషించింది.

కాగా, కార్పొరేట్‌ ఎన్‌పీఏలు 2020–21లో 10.8%గా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 10.4 శాతానికి తగ్గే వీలుందని అభిప్రాయపడింది. 2022–23లో రిటైల్‌ రంగంలో ఒత్తిడిలో ఉన్న రుణాలు 4.9 శాతానికి తగ్గుతాయని, ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల్లో ఈ పరిమాణం 16.7 శాతానికి పెరుగుతుందన్నది సంస్థ అంచనా. కార్పొరేట్‌ రంగం విషయంలో ఈ రేటు 10.3 శాతానికి దిగివస్తుందని పేర్కొంది.

Advertisement
 
Advertisement
 
Advertisement