
విద్యా, గృహ, వాహన రుణ రేట్లు తగ్గింపు
సేవింగ్స్ డిపాజిట్‌పై రేటు 2.5 శాతం
ముంబై: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) సేవింగ్స్ ఖాతాలకు సంబంధించి కనీస నిల్వ(మినిమం బ్యాలెన్స్) పెనాల్టీ చార్జీలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే, కొన్ని రకాల డిపాజిట్లు, రుణ రేట్లను సైతం సవరించింది. 999 రోజులకు సంబంధించి గ్రీన్ డిపాజిట్‌పై వడ్డీ రేటును 7% నుంచి 6.7 శాతానికి తగ్గించింది. రూ.లక్ష నుంచి రూ.10 కోట్ల మధ్య డిపాజిట్లకు ఈ రేటు అమలవుతుంది. సేవింగ్స్ ఖాతాలోని డిపాజిట్లపై రేటును 2.7% (వార్షిక) నుంచి 2.5 శాతానికి తగ్గించింది. ఇక గృహ రుణ రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.
ఇప్పటికే తీసుకున్న గృహ రుణాలతోపాటు కొత్తగా తీసుకునే గృహ రుణాలకు ఇది అమలవుతుందని తెలిపింది. సవరణ తర్వాత గృహ రుణాలపై వడ్డీ రేటు 7.35% నుంచి ప్రారంభమవుతుంది. రుణ గ్రహీత సిబిల్ స్కోరు ఆధారంగా ఈ రేటు మారుతుంది. ప్రతిష్టాత్మక ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందేవారికి 7.5% రేటుకే విద్యా రుణాలను ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. వాహన రుణాలపైనా అర శాతం రేటు తగ్గించినట్టు తెలిపింది. ఈ నిర్ణయాలు ఈ నెల 7 నుంచే అమల్లోకి వచి్చనట్టు పేర్కొంది. ఇప్పటికే ఎస్‌బీఐ, పీఎన్‌బీ, ఇండియన్ బ్యాంక్ సైతం సేవింగ్స్ ఖాతాలకు సంబంధించి కనీస బ్యాలన్స్ పెనాల్టీ చార్జీలను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం.