breaking news
Savings Account Deposits
-
బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘మినిమం’ చార్జీల ఎత్తివేత
ముంబై: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) సేవింగ్స్ ఖాతాలకు సంబంధించి కనీస నిల్వ(మినిమం బ్యాలెన్స్) పెనాల్టీ చార్జీలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే, కొన్ని రకాల డిపాజిట్లు, రుణ రేట్లను సైతం సవరించింది. 999 రోజులకు సంబంధించి గ్రీన్ డిపాజిట్‌పై వడ్డీ రేటును 7% నుంచి 6.7 శాతానికి తగ్గించింది. రూ.లక్ష నుంచి రూ.10 కోట్ల మధ్య డిపాజిట్లకు ఈ రేటు అమలవుతుంది. సేవింగ్స్ ఖాతాలోని డిపాజిట్లపై రేటును 2.7% (వార్షిక) నుంచి 2.5 శాతానికి తగ్గించింది. ఇక గృహ రుణ రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.ఇప్పటికే తీసుకున్న గృహ రుణాలతోపాటు కొత్తగా తీసుకునే గృహ రుణాలకు ఇది అమలవుతుందని తెలిపింది. సవరణ తర్వాత గృహ రుణాలపై వడ్డీ రేటు 7.35% నుంచి ప్రారంభమవుతుంది. రుణ గ్రహీత సిబిల్ స్కోరు ఆధారంగా ఈ రేటు మారుతుంది. ప్రతిష్టాత్మక ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందేవారికి 7.5% రేటుకే విద్యా రుణాలను ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. వాహన రుణాలపైనా అర శాతం రేటు తగ్గించినట్టు తెలిపింది. ఈ నిర్ణయాలు ఈ నెల 7 నుంచే అమల్లోకి వచి్చనట్టు పేర్కొంది. ఇప్పటికే ఎస్బీఐ, పీఎన్బీ, ఇండియన్ బ్యాంక్ సైతం సేవింగ్స్ ఖాతాలకు సంబంధించి కనీస బ్యాలన్స్ పెనాల్టీ చార్జీలను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. -
పొదుపు ఖాతాలపై వడ్డీకి కత్తెర
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పొదుపు ఖాతా డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేట్లకు మరింత కత్తెర వేసింది. రూ. లక్ష లోపు సేవింగ్స్ అకౌంట్స్ డిపాజిట్లపై వడ్డీ రేటును పావు శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటిదాకా 3.50 శాతంగా ఉన్న రేటు ఇకపై 3.25%కి తగ్గనుంది. నవంబర్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. తగినంత ద్రవ్య లభ్యత ఉన్నందున సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్స్‌పై రేటును (రూ. లక్ష దాకా బ్యాలెన్స్) సవరిస్తున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది. ఏడాది నుంచి రెండేళ్ల లోపు కాల వ్యవధి గల టర్మ్ డిపాజిట్లు, బల్క్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు, 30 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు పేర్కొంది. ఇది అక్టోబర్ 10 నుంచి అమల్లోకి వస్తుంది. రుణాలపై 0.10 శాతం తగ్గింపు.. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణాలపై వడ్డీ రేటు (ఎంసీఎల్ఆర్)ను స్వల్పంగా 0.10 శాతం మేర తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది. ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా రుణాలపై రేటు తగ్గించడం వరుసగా ఇది ఆరోసారి. ఏడాది కాలవ్యవధి ఎంసీఎల్ఆర్ ఇకపై 8.15% కాకుండా 8.05%గా ఉండనుంది. ఈ తగ్గింపు అక్టోబర్ 10 నుంచి అమల్లోకి వస్తుంది. ‘పండుగ సీజన్ దృష్టిలో ఉంచుకుని వివిధ విభాగాల ఖాతాదారులందరికీ ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో ఎంసీఎల్ఆర్ను 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నాం‘ అని ఎస్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేటులో పావు శాతం కోత పెట్టిన ఎస్బీఐ.. రుణాలపై వడ్డీ రేటును మాత్రం 0.10 శాతమే తగ్గించడం గమనార్హం. వృద్ధికి ఊతమిచ్చే దిశగా తక్కువ వడ్డీ రేట్లకే ప్రజలకు రుణాలు అందాలన్న లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ కీలక పాలసీ రేట్లను (రెపో రేటు) తగ్గిస్తూ వస్తోంది. అయినప్పటికీ బ్యాంకుల స్థాయిలో ఈ ప్రయోజనాలు ఖాతాదారులకు అందడం లేదు. ఆర్బీఐ ఈ ఏడాది వరుసగా 5 సార్లు రెపో రేటును తగ్గించడంతో ఇది ప్రస్తుతం దశాబ్దపు కనిష్ట స్థాయి 5.15%కి చేరింది. కానీ బ్యాంకుల స్థాయిలో మాత్రం ఆ మేరకు రుణాలపై వడ్డీ రేటు తగ్గడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు కూడా వడ్డీరేట్లకు కోత
న్యూఢిల్లీ : దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ లెండర్ హెచ్డీఎఫ్సీ బ్యాంకు కూడా సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్ల వడ్డీరేట్లకు కోత పెట్టింది. రూ.50 లక్షల కంటే తక్కువ అకౌంట్ బ్యాలెన్స్ ఉన్న డిపాజిట్లపై ఇక వార్షికంగా 3.5 శాతం మాత్రమే వడ్డీరేటు చెల్లించనునన్నట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంకు పేర్కొంది. ఈ వడ్డీ రేటు అంతకముందు 4 శాతంగా ఉండేది. రూ.50 లక్షలు, అంతకంటే ఎక్కువున్న మొత్తాలపై వడ్డీరేటు 4 శాతాన్ని అలానే కొనసాగించనున్నట్టు తెలిపింది. సమీక్షించిన ఈ రేట్లు రెసిడెంట్, నాన్-రెసిడెంట్ ప్రాంత కస్టమర్లందరకూ వర్తిస్తుందని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఓ ప్రకటనలో చెప్పింది. 2017 ఆగస్టు 19 నుంచి ఈ కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. నికర వడ్డీ ఆదాయాలను పెంచుకోవడానికి బ్యాంకులు వరుస బెట్టి సేవింగ్స్ అకౌంట్ వడ్డీరేట్లకు కోత పెడుతున్న సంగతి తెలిసిందే. తొలుత స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ వడ్డీరేట్ల కోత ప్రకటన విడుదల చేసింది. అనంతరం యాక్సిస్ బ్యాంకు, కర్నాటక బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంకు, యస్ బ్యాంకులు కొన్ని సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించాయి. కమర్షియల్ బ్యాంకులు సేవింగ్స్ బ్యాంకు రేట్లలో కోతను ప్రారంభించడం, వాటి మధ్య కొత్త తరహాలో పోటీని తెరతీస్తుందని క్రెడిట్ రేటింగ్ సంస్థ ఇండియా రేటింగ్స్ చెప్పింది.