బ్యాంకుల రుణాల్లో 8.9శాతం నుంచి 10.2% వృద్ధి!

Bank Credit Growth Likely To Be At 8.9 To10.2% Says Icra - Sakshi

ముంబై: బ్యాంకింగ్‌ రుణ వృద్ధి ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8.9 శాతం నుంచి 10.2 శాతం వరకూ నమోదయ్యే అవకాశం ఉందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా రేటింగ్స్‌ అంచనా వేసింది. 2022 మార్చి నాటికి బ్యాంకుల స్థూల మొండి బకాయిలు (జీఎన్‌పీఏ) 6.2 శాతం నుంచి 6.3 శాతం శ్రేణిలో ఉంటాయన్నది అంచనాకాగా,  2023 మార్చి నాటికి 5.6 – 5.7 శ్రేణికి  తగ్గుతాయని భావిస్తున్నట్లు తెలిపింది. ఇక నికర మొండిబాకాయిలు ఇదే కాలంలో 2 శాతం నుంచి 1.7.–1.8 శాతం శ్రేణికి దిగివచ్చే వీలుంది. నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. 

ఏప్రిల్‌తో ప్రారంభమైన 2022–23 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల అవుట్‌లుక్‌ స్థిరంగా ఉంటుందని అంచనా. బ్యాంకింగ్‌ రుణ వృద్ధి 2021–22లో 8.3 శాతంగా అంచనావేస్తే, 2022–23లో ఇది 8.9–10.2 శాతం శ్రేణికి మెరుగుపడే వీలుంది. 2020–21లో ఇది మరింత తక్కువగా 5.5 శాతంగా ఉంది.  

► రిటైల్‌ రంగం అలాగే సూక్ష్మ, లఘు చిన్న తరహా (ఎంఎస్‌ఎంఈ) పారిశ్రామిక రంగం చోదకంగా ఉండే ఆహారేతర విభాగాల నుంచి రుణ వృద్ధి బాగుంటుంది. నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలతో (ఎన్‌బీఎఫ్‌సీ) కో–లెండింగ్‌ సమన్వయ సౌలభ్యత పెరిగే వీలుంది.  

► 2019లో చోటుచేసుకున్న పరిణామాల తరహాలో హోల్‌సేల్‌ క్రెడిట్‌ విభాగంలో రుణ డిమాండ్‌ డెట్‌ క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి బ్యాంక్‌ క్రెడిట్‌కు మారే వీలుంది. డెట్‌ మార్కెట్‌లో బాండ్‌ ఈల్డ్‌ (వడ్డీ) భారీగా పెరిగే అవకాశం ఉండడం దీనికి కారణం. బాండ్‌ ఈల్డ్‌ పెరుగుదల నేపథ్యంలో 2022–23లో ట్రెజరీ ఇన్‌కమ్‌ కూడా గణనీయంగా తగ్గే వీలుంది.  

ఇక బ్యాంకింగ్‌ క్రెడిట్, ఇతర ప్రొవిజన్స్‌ (కేటాయింపులు) 2021–22లో 1.7 నుంచి 1.8 శాతం శ్రేణిలో ఉంటే 2022–23 నాటికి ఈ శాతాలు 1.3–1.4 శాతం శ్రేణికి తగ్గే వీలుంది.

2021–22లో డిపాజిట్ల వృద్ధి రేటు అంచనా 8.3 శాతం ఉంటే, 2022–23లో ఈ రేటు 7.3 శాతం నుంచి 7.9 శాతానికి తగ్గవచ్చు. 

► నియంత్రణ, ఎకానమీ వృద్ధి అవసరాల పరంగా ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకులకు 2022–23 ఆర్థిక సంవత్సరంలో తగిన మూలదనం ఉంటుందని భావిస్తున్నాం. ఇక ప్రైవేట్‌ బ్యాంకింగ్‌కు మూలధనం అవసరం రూ. 10,000 కోట్ల కంటే తక్కువగా ఉంటుంది. 

 రుణ వృద్ధి వల్ల బ్యాంకింగ్‌ వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) మిగులు రూ. 1.5–2.5 లక్షల కోట్లకు తగ్గుతుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కూడా వ్యవస్థలో మిగులు లిక్విడిటీని క్రమంగా వెనక్కు తీసుకునే అవకాశం ఉంది.  

► బలమైన కార్పొరేట్‌ క్రెడిట్‌ నిష్పత్తి, రిటైల్, ఎంఎస్‌ఎంఈ విభాగాల్లో  రుణ వృద్ధి,  ఎన్‌పీఏలు తగ్గడం, ఆదాయల పెరుగుదల వంటి అంశాలు ప్రధాన వృద్ధి చోదకాలుగా ఉంటాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top