న్యాయ వ్యవస్థలోకి చిట్టీ.. ది రోబో

Artificial Intelligence Can Help Reduce Backlog of Pending Cases says Law Minister Kiren Rijiju - Sakshi

దేశంలో కోర్టు కేసులంటే ఏళ్ల తరబడి సాగుతాయన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది. ఈ పరిస్థితిని మార్చేసే అవకాశాన్ని కృత్రిమ మేధ (ఏఐ) కల్పించనుంది! కేసుల నిర్వహణ, చట్టాల ఆన్‌లైన్‌ సమాచారం,అల్గారిథం ఆధారిత సహాయక వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా న్యాయస్థానాల పనితీరు మెరుగుపరచడంలో ఏఐ దోహదపడుతుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తాజాగా పేర్కొన్నారు. అంటే మంత్రి వ్యాఖ్యలను మరో విధంగా చెప్పాలంటే న్యాయవ్యవస్థలోకి చిట్టీ ది రోబోని ప్రవేశపెడతారన్నమాట. ఎంత పెద్ద పనులైనా ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ సాయంతో సత్వరం చేస్తూ న్యాయ ప్రకియలో వేగం పెరిగేలా చర్యలు తీసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే డిజిటైజేషన్‌ బాట పట్టిన భారత న్యాయ వ్యవస్థకు ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన ఏఐ ఏ రకంగా సాయపడగలదో ఓసారి పరిశీలిద్దాం.  

ప్రపంచ దేశాల్లో న్యాయస్థానాలకు కృత్రిమ మేధ (ఏఐ) అవసరం అవుతున్న సందర్భాలు ఇటీవలి కాలంలో ఎక్కువగానే ఉన్నాయి. అమెరికాతోపాటు కొన్ని ఇతర పాశ్చాత్య దేశాల్లో దీన్ని ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ ప్రధానంగా ఆరు రకాలుగా న్యాయ, చట్ట వ్యవస్థలకు ఉపయోగపడుతోంది. అవి ఏమిటంటే ఈ–డిస్కవరీ, ఆటోమేషన్, లీగల్‌ రీసెర్చ్, డాక్యుమెంట్‌ మెనేజ్‌మెంట్, కాంట్రాక్ట్‌ అండ్‌ లిటిగేషన్‌ డాక్యుమెంట్‌ అనలటిక్స్‌ అండ్‌ జనరేషన్, ప్రిడిక్టివ్‌ అనలిటిక్స్‌. వాటి గురించి క్లుప్తంగా... 

చిటికెలో దశాబ్దాల వివరాలు... 
కొన్ని దశాబ్దాలపాటు కోర్టుల్లో నమోదైన కేసులు.. వాటి తాలూకూ సూక్ష్మస్థాయి వివరాలను వెతకడం ఆషామాషీ కాదు. కానీ కృత్రిమ మేధ మాత్రం ఈ పనులను చిటికెలో చేసిపెడుతుంది. డాక్యుమెంట్లన్నింటినీ పరిశీలించి కేసుకు సంబంధించిన గత తీర్పులు, వాదనలను గుర్తించి అందించేందుకు ఈ–డిస్కవరీ ఉపయోగపడుతుంది. న్యాయవాదుల కంటే ఈ ఆర్టిఫిషల్‌ ఇంటెలిజెన్స్‌ సాఫ్ట్‌వేర్‌ మెరుగైందట! 

కళ్లముందే నిపుణుల అభిప్రాయాలు... 
ఏదో ఒక కేసులో నిపుణుడు ఇచ్చిన వివరాలు న్యాయస్థానాల రికార్డుల్లో ఉండే ఉంటాయి. కేసును బట్టి ఆయా అంశాలకు సంబంధించిన నిపుణుల అభిప్రాయాలు, వివరాలను అవసరమైనప్పుడు అందుకొనేందుకు వీలుగా ఎక్స్‌పర్టీస్‌ ఆటోమేషన్‌ను ఉపయగిస్తున్నారు. ఇప్పటికే దీన్ని వీలునామాల తయారీలో ఉపయోగిస్తున్నారు కూడా. అంతేకాకుండా లాయర్‌ అవసరం లేకుండానే కోర్టులో కేసులు వేసేందుకు, కేసు వివరాలను సరైన రీతిలో పొందుపరిచేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. 

ఒప్పందాల విశ్లేషణలో ప్రత్యేక ముద్ర... 
వ్యక్తులు, కంపెనీలు, సంస్థల మధ్య కుదిరే అనేక రకాల కాంట్రాక్టుల్లో ఏమాత్రం లోటుపాట్లు ఉన్నా.. సమస్యలు రావడం, కోర్టు కేసులకు దారితీయడం కద్దు. ఈ పరిస్థితి రాకుండా.. కుదిరిన ఒప్పందాన్ని పూర్తిగా విశ్లేషించి, భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులేవీ రాకుండా జాగ్రత్త పడేందుకూ ఏఐని ఉపయోగిస్తున్నారు. అమెరికాలో ఇటీవలి కాలంలో వీటి వినియోగం చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగిపోతోంది. 

తీర్పుల అంచనాకూ దోహదం.. 
ఫలానా కేసులో తీర్పు ఎలా వస్తుందో ఊహించడం కష్టమే. న్యాయసూత్రాలు పక్కాగా తెలియడంతోపాటు కేసు పూర్వాపరాలపై కచ్చితమైన అంచనాలు అవసరమవుతాయి. కానీ కొన్ని ఏఐ సాఫ్ట్‌వేర్లు ఇప్పుడు తీర్పులను కూడా ముందుగానే అంచనా వేస్తున్నాయి. వాటి కచ్చితత్వం ఎంత అన్నది ప్రస్తుతానికి స్పష్టంగా తెలియకున్నా ఆ ప్రయత్నమైతే జరుగుతోంది. 
– సాక్షి, హైదరాబాద్‌  

న్యాయ పరిశోధనలోనూ తనదైన ముద్ర... 
దేశం మొత్తమ్మీద ఒకే రకమైన న్యాయసూత్రాలు ఉండటం కష్టమే. కొన్ని విషయాల్లో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో చట్టం, నిబంధనలు ఉంటాయి. ఈ తేడా దేశాలకూ వర్తిస్తుంది. ఈ వివరాలన్నీ అవసరానికి తగ్గట్టు మీకు అందించేందుకు లీగల్‌ రీసెర్చ్‌ ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ సాయంతో లేదా ప్రశ్న, జవాబుల రూపంలోనూ అవసరమైన వివరాలను అందించడం దీని ప్రత్యేకత. 

లక్షల గంటలు పట్టే పని సెకన్లలోనే... 
కోర్టు కేసుల్లో మాత్రమే కాదు.. కంపెనీల్లోనూ కాంట్రాక్ట్‌ల రూపంలో బోలెడన్ని దస్తావేజులు ఉంటాయి. వాటి సక్రమ నిర్వహణ ఎంతో అవసరం. ఇందుకు సరిగ్గా సరిపోయే ఏఐ సాఫ్ట్‌వేర్‌ డాక్యుమెంట్‌ మేనేజ్‌మెంట్‌. ఇటీవల జేపీ మోర్గాన్‌ అనే సంస్థ ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ సాయంతో న్యాయవాదులు 3.6 లక్షల గంటల్లో చేసే పనిని సెకన్లలో పూర్తి చేసేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top