గూగుల్‌లో కొత్త ఫీచర్స్‌..

Android 12: New Features In Googles Latest Mobile OS - Sakshi

ఆండ్రాయిడ్‌ 12 బీటా వెర్షన్‌ ఆవిష్కరణ 

కొత్త ప్రైవసీ సెట్టింగ్స్, ఏఐ టూల్స్‌

న్యూఢిల్లీ: టెక్‌ దిగ్గజం గూగుల్‌ కొత్త ప్రైవసీ సెట్టింగ్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టూల్స్‌తో పాటు ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్‌ సిస్టం బీటా వెర్షన్‌ను ఆవిష్కరించింది. అమెరికాలోని మౌంటెయిన్‌ వ్యూ క్యాంపస్‌లో వర్చువల్‌గా నిర్వహించిన గూగుల్‌ ఐ/ఓ 2021 కార్యక్రమంలో వీటిని పరిచయం చేసింది. వీటిని ఈ ఏడాది ప్రవేశపెట్టే ఉత్పత్తుల్లో పొందుపర్చనుంది. ‘‘కోవిడ్‌–19తో నా మాతృదేశమైన భారత్‌తో పాటు బ్రెజిల్‌ తదితర దేశాలు ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ఈ తరుణంలో బోధన, చిన్న వ్యాపార సంస్థల కార్యకలాపాలు సజావుగా సాగేందుకు, అవసరమైన వారికి టీకాలు మొదలైన అత్యవసరాలు సత్వరం అందేందుకు గూగుల్‌ పలు ఉత్పత్తులు ప్రవేశపెట్టింది. చర్యలు తీసుకుంది’’ అని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. సెర్చి, లెన్స్, ఫొటోస్, మ్యాప్స్, షాపింగ్‌ మొదలైన ఉత్పత్తుల్లో ఈ ఏడాది ప్రవేశపెట్టబోయే కొత్త ఫీచర్లను ఈ సందర్భంగా ఆయన వివరించారు. 

మరిన్ని విశేషాలు.. 
►గోప్యతను మరింత మెరుగుపర్చేందుకు ‘‘క్విక్‌ డిలీట్‌’’ ఆప్షన్‌. దీనితో గూగుల్‌ అకౌంట్‌ మెనూ ద్వారా ఒక్కసారి ట్యాప్‌ చేసి 15 నిమిషాల సెర్చి హిస్టరీని డిలీట్‌ చేసేయొచ్చు. 
►మ్యాప్స్‌ టైమ్‌లైన్‌లో లొకేషన్‌ హిస్టరీ ఫీచర్‌. 
►గూగుల్‌ ఫొటోస్‌లో పాస్‌వర్డ్‌ రక్షణతో ‘‘లాక్డ్‌ ఫోల్డర్‌’’ ఫీచరు. యూజరు ఎంపిక చేసుకున్న ఫొటోలను విడిగా భద్రపర్చుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇవి గ్రిడ్‌ లేదా షేర్డ్‌ ఆల్బమ్స్‌లో కనిపించవు. దీన్ని ముందుగా గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్‌లలో ఆ తర్వాత మిగతా ఆండ్రాయిడ్‌ పరికరాల్లో అందుబాటులోకి తెస్తారు. 
►2014 తర్వాత డిజైన్‌పరంగా గణనీయమైన మార్పులు, చేర్పులతో ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ బీటా వెర్షన్‌. ఇందులో పారదర్శకతకు పెద్ద పీట వేస్తున్నారు. యూజర్‌ డేటాను ఏయే యాప్స్‌ తీసుకుంటున్నాయన్న వివరాలను అందించడంతో పాటు యూజర్లకు డివైజ్‌పై మరింతగా నియంత్రణ ఉండేలా ఆండ్రాయిడ్‌ 12 రూపకల్పన. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top