కంపెనీలకు క్లౌడ్‌ దన్ను

Amid global uncertainties, cloud enabling companies to be cost-effective - Sakshi

వ్యయాల నియంత్రణకు, నవకల్పనలకు ఊతం

ఏడబ్ల్యూఎస్‌ సీఈవో ఆడమ్‌ వెల్లడి

లాస్‌ వెగాస్, అమెరికా: అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు తదితర సవాళ్లు నెలకొన్న నేపథ్యంలో కంపెనీలు వ్యయాలను నియంత్రించుకుని .. సమర్ధంగా పని చేసేందుకు, నవకల్పనలను ఆవిష్కరించేందుకు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ తోడ్పాటునిస్తోందని అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌) సీఈవో ఆడమ్‌ సెలిప్‌స్కీ తెలిపారు. సవాళ్లతో కూడుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో సరైన సాధనాలతో కంపెనీలు నిలదొక్కుకుని, పురోగమించగలవని పేర్కొన్నారు. ఏడబ్ల్యూఎస్‌ రీ:ఇన్వెంట్‌ కార్యక్రమంలో కీలకోపన్యాసం చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. 2025 నాటికి తమ కార్యకలాపాలకు 100 శాతం పునరుత్పాదక విద్యుత్‌నే వినియోగించుకునేందుకు కట్టుబడి ఉన్నామని ఆడమ్‌ వివరించారు.

ఇప్పటివరకూ ఈ లక్ష్యంలో 85 శాతం వరకూ చేరుకున్నామని పేర్కొన్నారు. క్లౌడ్‌ కంప్యూటింగ్‌తో చాలా మంది కస్టమర్లకు 30 శాతం వరకూ ఖర్చులు ఆదా అవుతున్నాయని ఆడమ్‌ చెప్పారు. కేవలం ఉపయోగించుకున్న సేవలు, మౌలిక సదుపాయాలకు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని, కార్యకలాపాలను వేగవంతంగా విస్తరించుకునేందుకైనా .. తగ్గించుకునేందుకైనా ఇది ఎంతో అనువైనదిగా ఉంటుందని పేర్కొన్నారు. డేటా సెంటర్లు, సర్వర్లను కొనుక్కుని పెట్టుకోవడం, వాటిని నిర్వహించుకోవడం వంటివి ఖర్చులతో కూడుకున్న వ్యవహారమని .. అందుకు భిన్నంగా ఏడబ్ల్యూఎస్‌ వంటి క్లౌడ్‌ సేవల సంస్తల నుంచి టెక్నాలజీ సర్వీసులను సులభతరంగా పొందవచ్చని ఆడమ్‌ చెప్పారు. ఏడబ్ల్యూఎస్‌ ఇటీవలే 4.4 బిలియన్‌ డాలర్లతో హైదరాబాద్‌లో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెజాన్‌కు ఇది భారత్‌లో రెండోది కానుంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top