అంబానీ కీలక నిర్ణయం: మరో రంగంలో సునామీకి సిద్ధం

Ambani Reliance to foray healh sector with cheapest genetic mapping test - Sakshi

సాక్షి, ముంబై: ఆసియా  బిలియనీర్‌ రిలయన్స్‌ అధినేత  ముఖేశ్‌ అంబానీ మరో రంగంలోకి అడుగు  పెట్టాలని నిర్ణయించారు.  ఇప్పటికే ఆయిల్‌, టెలికాం, రీటైల్‌ రంగాల్లో దూసుకుపోతున్న  రిలయన్స్‌ ఇపుడిక హెల్త్‌ కేర్‌ సెక్టార్‌లో  ప్రవేశించనుంది. అదీ స్థానికంగా లభించే ఇతర ఆఫర్‌ల కంటే తక్కువకే జినోమ్‌ మ్యాపింగ్‌ పరీక్షలను అందుబాటులోకి తీసుకురానుంది. స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్  రూపొందించిన  జినోమ్  కిట్‌ను 145 డాలర్లకు,    మార్కెట్‌ ధరలతో  పోలిస్తే దాదాపు 86 శాతం తక్కువకే అందించనుంది. కొన్ని జన్యుపరమైన రుగ్మతలు, వ్యాధులను గుర్తించడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. మైజియో యాప్‌లో రాబోయే వారాల్లో ఈ టెస్ట్‌ను దూకుడుగా మార్కెట్ చేయాలని రిలయన్స్ యోచిస్తోంది.

ముఖేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జినోమ్ మ్యాపింగ్ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోంది. క్యాన్సర్‌లు, న్యూరో-డీజెనరేటివ్ వ్యాధులు, గుండె సంబంధిత ప్రమాదాలు లాంటి  వ్యాధులు,  వాటి  ప్రభావాలు  తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్రొఫైల్‌ని స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ అభివృద్ధి చేసింది.  మరికొన్నివారాల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్ష కిట్‌ను కేవలం రూ.12 వేలకే అందుబాటులోకి తెస్తున్నట్లు స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్  సీఈవో రమేష్ హరిహరన్ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత చౌకైన జినోమిక్ ప్రొఫైల్ ఇదేనని రమేష్ హరిహరన్‌ తెలిపారు. ఫలితాలను వివరించడంలో స్ట్రాండ్ సరికొత్త శాస్త్రీయ పరిశోధనలను పొందుపరుస్తుందని హరిహరన్ తెలిపారు. ఈ పరీక్ష ఔషధాల అభివృద్ధికి సహాయపడే జీవసంబంధమైన డేటా రిపోజిటరీని రూపొందించడానికి కూడా అనుమతిస్తుందని ఆయన పేర్కొన్నారు.

బెంగళూరుకు చెందిన ఈ సంస్థలో దాదాపు 80 శాతం వాటాలను రిలయన్స్ గ్రూప్ 2021లోనే కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.  అమెరికాలోని 23andMe స్టార్టప్ మాదిరిగా తక్కువ ఖర్చుతో భారతీయులందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. ఇంకా    MapmyGenome, Medgenome వంటి భారతీయ కంపెనీల పూర్తి జీనోమ్ సీక్వెన్సింగ్ 1,000డాలర్లు కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో  తక్కువ ధరలో టెలికాం రంగంలో సునామీ సృష్టించిన అంబానీ తాజా నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top