నేనింకా దొంగనేనా?.. విజయ్ మాల్యా సంచలన ట్వీట్ | Am I Still a Chor or Cheat Vijay Mallya Tweet Viral | Sakshi
Sakshi News home page

నేనింకా దొంగనేనా?.. విజయ్ మాల్యా సంచలన ట్వీట్

Oct 15 2026 12:25 PM | Updated on Oct 15 2026 12:35 PM

Am I Still a Chor or Cheat Vijay Mallya Tweet Viral

తన విలాసవంతమైన జీవనశైలిపై వస్తున్న విమర్శలకు వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరోసారి స్పందించారు. ''నా సొంత డబ్బుతో రాజులా బతకడం నేరమా?'' అంటూ ప్రశ్నించారు. తన నుంచి వసూలు చేసిన ఆస్తుల విలువ, బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిలతో పోలిస్తే.. ఎక్కువగా ఉందని ఆయన గతంలోనూ పలుమార్లు వాదించారు. తాజాగా కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులను ప్రస్తావిస్తూ, తనను ఇంకా దొంగగా లేదా మోసగాడిగా పిలవడం సరైనదేనా? అని ప్రశ్నించారు.

విజయ్ మాల్యా ట్వీట్
ఎక్స్‌ (X) వేదికగా కోర్టు ఉత్తర్వులను షేర్ చేసిన మాల్యా.. వాటిని జాగ్రత్తగా చదవాలని కోరారు. తన సొంత డబ్బుతో విలాసవంతమైన జీవితం గడపడమే తనకు పెద్ద నేరంగా మారిందని వ్యాఖ్యానించారు. చివరికి న్యాయం గెలుస్తుందని, దేవుడు అన్నీ చూస్తున్నాడని పేర్కొన్నారు.

బ్యాంకుల బకాయిల కంటే ఎక్కువ ఆస్తులు రికవరీ అయ్యాయనే విషయం మీద చర్చ జరుగుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో వెల్లడించిన వివరాలను కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు ప్రస్తావించాయి. యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (UBL) షేర్లకు అదనంగా రూ.14,131.6 కోట్ల విలువైన ఆస్తులను బ్యాంకుల కన్సార్టియానికి తిరిగి అందించినట్లు అందులో పేర్కొన్నారు. అయితే.. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఇచ్చిన రుణానికి సంబంధించి బ్యాంకుల క్లెయిమ్ రూ.6,203 కోట్లుగా ఉంది.

అయితే.. ఈ వ్యవహారంలో మరో అంశాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది. మాల్యా విలాసవంతమైన జీవనశైలి, వ్యక్తిగత ఆడంబరం కారణంగా బ్యాంకుల క్లెయిమ్‌లకు ముగింపు పలకడం కష్టమవుతోందని అభిప్రాయపడినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఆస్తుల రికవరీ
తనపై కొనసాగుతున్న క్రిమినల్ కేసులను రద్దు చేయాలని విజయ్ మాల్యా కోరుతున్నారు. 2020లో బాంబే హైకోర్టును ఆశ్రయించిన ఆయన.. బ్యాంకులకు చెందిన బకాయిల విషయంలో ఆస్తుల రికవరీ జరిగిందని, అందువల్ల కేసులను కొనసాగించాల్సిన అవసరం లేదని వాదించారు. అయితే.. బ్యాంకుల కన్సార్టియం ఆయన వాదనను వ్యతిరేకించింది. కేసులో జప్తు చేసిన కొన్ని షేర్లు ఇంకా అలాగే ఉన్నాయని, వాటిని విక్రయించలేదని తెలిపింది.

ప్రస్తుతం ఈ వ్యవహారం రెండు కోణాల్లో కొనసాగుతోంది. ఒకటి బ్యాంకులకు రావాల్సిన రుణాలను తిరిగి వసూలు చేసే ప్రక్రియ. రెండోది బ్యాంకు మోసం, నేరపూరిత కుట్ర, మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) చేపట్టిన క్రిమినల్ చర్యలు.

ఆస్తులు తిరిగి ఇచ్చేస్తే కేసులు ముగిసిపోతాయా? అనే ప్రశ్నకు దర్యాప్తు సంస్థలు మాత్రం భిన్నమైన సమాధానాలు చెబుతున్నాయి. సుమారు రూ.14,132 కోట్ల విలువైన ఆస్తులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు తిరిగి అందించినట్లు ఈడీ పేర్కొన్నప్పటికీ, ఆస్తుల రికవరీతో క్రిమినల్ కేసులు ఆటోమేటిక్‌గా ముగిసిపోవని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement