ఎంత సంపాదించినా పొదుపు చేయడం అందరికీ అలవడదు. కానీ ఇది పుట్టుకతోనే వస్తుందని చెబుతోంది సంఖ్యా శాస్త్రం. తక్కువ జీతంతోనూ పొదుపు చేయడం, సంపాదించిన డబ్బును నిలబెట్టుకోవడం కొందరిలో కనిపించే అలవాటు. అయితే, పుట్టిన తేదీకి ఆర్థిక విజయాన్ని అనుసంధానిస్తూ న్యూమరాలజీ కొన్ని ఆసక్తికరమైన విశ్లేషణలు చేస్తోంది. ముఖ్యంగా ప్రతి నెల 3, 5, 8, 17, 21, 23 తేదీల్లో జన్మించినవారికి డబ్బు నిర్వహణలో ప్రత్యేక లక్షణాలు ఉంటాయని ఈ విధానం చెబుతోంది.
3, 21 తేదీలు: న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీలను బృహస్పతితో అనుసంధానిస్తారు. జ్ఞానం, బోధన, సలహాలు, కన్సల్టింగ్ వంటి రంగాల్లో రాణించే స్వభావం ఉంటుందని నమ్ముతారు. అయితే, ఇతరులకు అవసరానికి మించి ఆర్థిక సాయం చేయడం వల్ల పొదుపు తగ్గే ప్రమాదం ఉందని చెబుతారు.
5, 23 తేదీలు: ఈ తేదీలను బుధుడితో ముడిపెడతారు. వ్యాపారం, మార్కెటింగ్, అమ్మకాలు వంటి రంగాల్లో అవకాశాలను త్వరగా గుర్తిస్తారని న్యూమరాలజీ వివరిస్తుంది. అయితే, తరచూ ఉద్యోగాలు లేదా పెట్టుబడులు మార్చడం వల్ల దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతినవచ్చని సూచిస్తుంది.
8, 17 తేదీలు: ఈ తేదీలు శనికి సంబంధించినవిగా భావిస్తారు. క్రమశిక్షణ, సహనం, దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి వంటి లక్షణాలతో సంపదను క్రమంగా పెంచుకోవచ్చని న్యూమరాలజీ చెబుతోంది. అయితే, అతిగా పొదుపు చేస్తూ విశ్రాంతి, వ్యక్తిగత అవసరాలను నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తుంది.
అయితే, పుట్టిన తేదీ ఆధారంగా సంపద పెరుగుతుందని లేదా ఆర్థిక విజయాన్ని ముందే అంచనా వేయవచ్చని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. నిజ జీవితంలో ఆదాయానికి తగిన ఖర్చులు, అత్యవసర నిధి, అప్పుల నియంత్రణ, క్రమబద్ధమైన పెట్టుబడులు, ఆర్థిక లక్ష్యాలే పొదుపును పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఇదీ చదవండి: బెంగళూరులో ఇల్లు అద్దెకు తీసుకోవడమే పాపమా?


