
హైదరాబాద్: హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (హెచ్ఎంఏ) నూతన అధ్యక్షుడిగా అల్వాల దేవేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. 2025-26 సంవత్సరానికి హెచ్ఎంఏ తన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. కార్యవర్గ సమావేశంలో అల్వాల దేవేందర్ రెడ్డిని ఏకగ్రీవంగా కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈయన ఈరైడ్ విద్యుత్ వాహనాల సంస్థ వ్యవస్థాపకుడు.
శరత్ చంద్ర మారోజును ఉపాధ్యక్షుడిగా, వాసుదేవన్‌ను కార్యదర్శిగా కార్యవర్గం ఎన్నుకుంది. కొత్త మేనేజ్‌మెంట్ కమిటీలో ఇంకా సిండిక్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ శరత్ చంద్ర మారోజు, ఈక్విటాస్ బ్యాంక్ జాతీయ అధిపతి వాసుదేవన్, ధ్రుమతారు కన్సల్టెంట్స్ వ్యవస్థపకులు, సీఈఓ చేతనా జైన్, స్టెల్త్ స్టార్టప్ వ్యవస్థాపకులు వి.శ్రీనివాసరావు, సిటో హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈఓ అంకర వెంకట కృష్ణ ప్రసాద్ ఉన్నారు.
ఈ సందర్భంగా హెచ్ఎంఏ నూతనాధ్యక్షుడు అల్వాల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, “వివిధ పరిశ్రమల్లో యాజమాన్య విధానాలను మరింత బలోపేతం చేయడంపై మేం ప్రధానంగా దృష్టిపెడతాం. అదే సమయంలో విద్యార్థుల సామర్థ్యాలను కూడా పెంపొందిస్తాం. వాళ్లను ఆంత్రప్రెన్యూర్లుగా లేదా కార్పొరేట్ ఉద్యోగాలకు సరిపోయేలా తీర్చిదిద్దుతాం” అని తెలిపారు. హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (హెచ్ఎంఏ) 1964 నుంచి నడుస్తున్న స్వచ్ఛంద సంస్థ. సరికొత్త యాజమాన్య విధానాలపై యువ మేనేజర్లు, వృత్తినిపుణులు, విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచుతుంది.