ఇంధన సర్‌చార్జీ వడ్డింపు
దేశీ సర్వీసులపై రూ. 899వరకు,
విదేశీ ఫ్లయిట్స్‌పై 280 డాలర్ల వరకు విధింపు
ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి
ముంబై: పశ్చిమాసియా ఉద్రిక్తతలతో విమాన ఇంధనం (ఏటీఎఫ్) రేట్లు భారీగా ఎగిసిన నేపథ్యంలో ఎయిరిండియా గ్రూప్ తమ ఫ్లయిట్స్‌పై ఇంధన సర్‌చార్జీని విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇది దేశీ ఫ్లయిట్స్‌పై రూ. 299 నుంచి రూ. 899 వరకు, విదేశీ రూట్లలో 24 డాలర్ల నుంచి 280 డాలర్ల వరకు (కొన్ని రూట్లు మినహాయించి) ఉంటుంది. ఏప్రిల్ 8 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని ఎయిరిండియా గ్రూప్ పేర్కొంది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాలకు కూడా ఇవి వర్తిస్తాయి.
బంగ్లాదేశ్, జపాన్, హాంకాంగ్, దక్షిణ కొరియా తదితర రూట్లకు సంబంధించి నియంత్రణ సంస్థ నుంచి వచ్చే అనుమతులను బట్టి నిర్ణయాలు ప్రకటించనున్నట్లు సంస్థ తెలిపింది. ఫిబ్రవరి 27తో ముగిసిన వారాంతంలో బ్యారెల్‌కి 27.83 డాలర్లుగా ఉన్న ఏటీఎఫ్ మార్చి 27న ముగిసిన వారాంతానికి 81.44 డాలర్లకు ఎగిసినట్లు తెలిపింది. ఈ పరిస్థితుల్లో సర్‌చార్జీలను విధించినప్పటికీ ఏటీఎఫ్ వ్యయాలు పూర్తిగా రికవర్ కావని, ఇప్పటికీ సింహభాగం భారాన్ని సంస్థే భరిస్తోందని ఎయిరిండియా పేర్కొంది. ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయాల్లో ఏటీఎఫ్ వాటా 40–45 శాతం వరకు ఉంటుంది. మరో విమానయాన సంస్థ ఇండిగో ఇప్పటికే ఇంధన సర్‌చార్జీలను సవరించిన సంగతి తెలిసిందే.
సీఈవో విల్సన్ రాజీనామా
ఎయిరిండియా సీఈవో, ఎండీ క్యాంప్‌బెల్ విల్సన్ రాజీనామా చేశారు. దీనితో ఆయన స్థానంలో కొత్త వారి నియామకం కోసం కంపెనీ ప్రత్యేక కమిటీని నియమించింది. న్యూజిలాండ్‌కి చెందిన విల్సన్ గతంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కి పని చేశారు. 2022లో ఎయిరిండియా పగ్గాలు చేపట్టిన విల్సన్ గత నాలుగేళ్లుగా సీఈవో, ఎండీగా పని చేస్తున్నారు. ‘2026లో తప్పుకోవాలనే యోచనలో ఉన్నట్లు 2024లోనే ఎయిరిండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌కి విల్సన్ తెలిపారు. అధికార బదలాయింపు ప్రక్రియ సజావుగా సాగేట్లుగా అప్పటి నుంచే కసరత్తు జరుగుతోంది‘ అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
వారసుడు ఎంపికయ్యేంత వరకు విల్సన్ ప్రస్తుత హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తారని పేర్కొంది. ‘కోవిడ్ అనంతరం పలు సవాళ్లు ఎదురైనప్పటికీ కంపెనీ వాటిని అధిగమించి, పురోగమించడంలో విల్సన్ కీలకపాత్ర పోషించారు‘ అని చంద్రశేఖరన్ కితాబిచ్చారు. ‘ఎయిర్‌క్రాఫ్ట్‌ల డెలివరీలు, సరఫరా వ్యవస్థలో సవాళ్లు, రెండు యుద్ధాలు, ఎయిర్‌స్పేస్ మూసివేత, ఇంధన ధరల పెంపు, అన్నింటికన్నా ముఖ్యంగా ఒక పెను విషాదం (అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఘటన)లాంటి అసాధారణ ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ మీరు సాధించిన విజయాలు ఎంతో గర్వకారణం.
కొత్త విమానాల డెలివరీలు త్వరలో ప్రారంభం కానున్న తరుణంలో నేను కంపెనీ పగ్గాలను మరొకరికి అప్పగించేందుకు ఇదే సరైన సమయం‘ అని ఉద్యోగులకి ఇచ్చిన సందేశంలో విల్సన్ పేర్కొన్నారు. 2022లో ఎయిరిండియాను ప్రభుత్వం నుంచి టాటాలు కొనుగోలు చేసిన అనంతరం నాలుగు ఎయిర్‌లైన్స్‌ని విజయవంతంగా విలీనం చేయడం తదితర అంశాల్లో విల్సన్ కీలక పాత్ర పోషించారు. అయితే, 250 మంది ప్రయాణికులు మరణించిన ఎయిరిండియా విమాన దుర్ఘటన, ఇతరత్రా సందర్భాల్లో భద్రతా ప్రమాణాల లోపాలు తదితర అంశాలపై విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.


