Electric Bike: తొమ్మిదో తరగతి కుర్రాడి ఆలోచన.. పాత రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌తో ఈ-బైక్‌

9th Class Student Build Electric Bike With Old Royal Enfield Bike Scrap - Sakshi

అగ్గిపుల్ల.. సబ్బుబిళ్ళ.. కాదేది ప్రయోగానికి అనర్హం అనే చందాన,  ఓ కుర్రాడు పాత బైక్‌ స్క్రాప్‌తో ఏకంగా ఎలక్ట్రిక్‌ బైక్‌ తయారీ చేసి ఔరా అనిపించాడు. లాక్‌డౌన్‌ సమయాన్ని వృథా చేయకూడదనే అతని ఆలోచన.. ఇలా అద్భుతాన్ని ఆవిష్కరించింది. అయితే ఈ ఆవిష్కరణ కోసం ఆ కుర్రాడు.. తన తండ్రికి చెప్పిన ఒక్క అబద్ధం ఏమిటి? ఆ అబద్ధం  అతని జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? ఇందుకోసం రాజన్‌ ఎలా కష్టపడ్డాడో ఇప్పుడు చూద్దాం..         

 ఢిల్లీ సుభాష్‌ నగర్‌కు చెందిన రాజన్‌.. ఒక్కడే పాత రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను ఎలక్ట్రిక్‌ బైక్‌గా మార్చాడు. అయితే ఈ బైక్‌ తయారీ వెనుక పెద్ద స్టోరీయే ఉందని  కుర్రాడి తండ్రి దశరథ్ శర్మ చెబుతున్నారు.  కరోనా కారణంగా లాక్‌ డౌన్‌ విధించడంతో ఆటపాటలతో కాకుండా.. రాజన్‌ ఏదో ఒక ప్రయోగం చేయాలని అనుకున్నాడు. ప్రయోగంలో భాగంగా ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ తయారీ మీద అతని దృష్టి పడింది. ముందు ఎలక్ట్రిక్‌ సైకిల్‌ తయారీకి పూనుకోగా.. అదికాస్త విఫలం అయ్యింది. ఆ ప్రయోగంలో రాజన్‌ గాయపడ్డాడు కూడా. దీంతో రాజన్‌ను తండ్రి అడ్డుకున్నారు. అయితే ఆ కుర్రాడికి ప్రయోగాలంటే చాలా ఇష్టం. అందుకే ఓ ప్లాన్‌ వేశాడు.

స్కూల్‌ ప్రాజెక్టు వంకతో..
స్కూల్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎలక్ట్రిక్‌ బైక్‌ తయారు చేయాలని టీచర్లు చెప్పినట్లు తండ్రికి అబద్ధం చెప్పాడు రాజన్‌. అది నిజమని భావించి..  స్నేహితులు, ఆఫీస్‌ కొలీగ్స్‌ సాయంతో ఆ ‘అబద్ధపు’ ప్రాజెక్టు డబ్బులు సమకూర్చాడు దశరథ్‌. అటుపై మాయాపురి జంక్‌ మార్కెట్‌ నుంచి ఓ పాత రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ తెచ్చి ఇచ్చాడు. ఇక రాజన్‌ ఆ పాత బండిని ఎలక్ట్రికల్‌ బైక్‌గా మార్చే పనిలో పడ్డాడు. మూడు నెలల పాటు శ్రమించి ఎలక్ట్రిక్‌ బైక్‌కు ఒక రూపం తీసుకొచ్చాడు. ఈ ప్రయత్నంలో తండ్రి దశరథ్‌ రోజూ కొడుకును ప్రొత్సహించడం విశేషం. చివరికి తండ్రికి రాజన్‌ అసలు విషయం చెప్పడం..  కొడుకు సాధించిన ఘనత చూసి ఆ తండ్రి ఉప్పొంగిపోవడం ఒకదాని వెంట ఒకటి జరిగాయి.

‘‘రాజన్‌ వయసు పదిహేనేళ్లు. టీచర్లు ఇలాంటి ప్రాజెక్టు ఇవ్వడం ఏంటి? వీడేం ఎలక్ట్రిక్‌ బైక్‌ తయారు చేస్తాడని నవ్వుకున్నా. కానీ, తీరా బైక్‌ను చూశాక నా కళ్లారా నేనే నమ్మలేకపోయా’ అంటున్నాడు దశరథ్‌. విశేషం ఏంటంటే.. గూగుల్, యూట్యూబ్‌లో చూసి ఈ ఈ-బైక్‌ను తయారు చేశాడు రాజన్‌. గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలిగే ఈ ఈ-బైక్‌ను పరిశీలన పంపనున్నట్లు జిల్లా అధికారి సంత్ రామ్ చెప్తున్నారు. ఈ బైక్‌ తయారీ సఫలం కావడంతో రాజన్ ఇప్పుడు ఎలక్ట్రిక్‌ కారును తయారీపై ఫోకస్‌ పెట్టాడు.

చదవండి: Tesla: వారెవ్వా టెస్లా.. ‘లేజర్‌’తో అద్దాలు శుభ్రం!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top