దేశంలో జోరుగా డేటా సెంటర్ల వ్యాపార విస్తరణ!

As 45 Data Centres Are Expected To Come Up By 2025 - Sakshi

న్యూఢిల్లీ: డేటా సెంటర్ల వ్యాపార విస్తరణ దేశంలో జోరుగా సాగుతోంది. ఇప్పటికే 138 డేటా కేంద్రాలతో ఈ పరిశ్రమ 5.6 బిలియన్‌ డాలర్ల (రూ.44,800 కోట్లు) స్థాయికి చేరుకుంది. 2025 నాటికి కొత్తగా 45 డేటా సెంటర్లు ఏర్పాటవుతాయని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్‌ పేర్కొంది. బిన్స్‌వేంజర్‌తో కలసి ఈ సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. 

‘‘ప్రస్తుతం ఉన్న 138 డేటా కేంద్రాలు 11 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంతో 737 మెగావాట్ల ఐటీ సామర్థ్యంతో ఉన్నాయి. ఇందులో 57 శాతం సామర్థ్యం ముంబై, చెన్నైలోనే ఏర్పాటై ఉంది. మరో 13 మిలియన్‌ చదరపు అడుగుల పరిధిలో 1,015 మెగావాట్ల ఐటీ సామర్థ్యంతో 45 డేటా కేంద్రాలు వచ్చే మూడేళ్లలో ఏర్పాటు కానున్నాయి. ఇందులోనూ 69 శాతం సామర్థ్యం చెన్నై, ముంబైలోనే ఏర్పాటు కానుంది. కొత్తవి కూడా కార్యకలాపాలు ప్రారంభించిన అనంతరం దేశవ్యాప్తంగా 183 డేటా సెంటర్లు, 24 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంతో, 1,752 మెగావాట్ల ఐటీ సామర్థ్యంతో ఉంటాయి. భారత్‌లో డేటా సెంటర్ల వ్యాపారం పరిణామ క్రమంలో ఉందని నివేదిక పేర్కొంది.   

టెక్నాలజీ, డిజిటైజేషన్‌ డిమాండ్‌ 
‘‘టెక్నాలజీ ఆమోదం, డిజిటైజేషన్‌ అన్నది అన్ని రంగాల్లోనూ వేగంగా కొనసాగుతోంది. భారత్‌ కూడా ఒక దశాబ్దం పాటు దీని ఒరవడిని చూస్తుంది. దేశవ్యాప్తంగా డేటా సెంటర్ల డిమాండ్‌ 2025 నాటికి 2,100 మెగావాట్లకు చేరుతుంది’’అని అనరాక్‌ క్యాపిటల్‌ ప్రెసిడెంట్‌ దేవిశంకర్‌ తెలిపారు. భవిష్యత్తులో 2,688 మెగావాట్ల మేర ప్రణాళికలేని అదనపు సరఫరా భారత మార్కెట్లోకి వస్తుందన్నారు. భిన్న రంగాల్లోని డేటా సంబంధిత సదుపాయాల నిర్వహణలో అనుభవం కలిగిన నిపుణులు ఈ నివేదిక రూపొందించినట్టు పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top