15 ఏళ్ల బాలుడు.. రూ.100 కోట్ల కంపెనీ.. ఎలా సాధ్యమైందంటే.. | Sakshi
Sakshi News home page

15 ఏళ్ల బాలుడు.. రూ.100 కోట్ల కంపెనీ.. ఎలా సాధ్యమైందంటే..

Published Thu, Nov 23 2023 3:21 PM

15 Year Old Boy 100 Crores Company - Sakshi

ఒక మంచి ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. అవసరాలే సమస్యలకు పరిష్కారాలు కనుగొంటాయి. ఆ పరిష్కారాలను మంచి బిజినెస్‌ ఐడియాగా మలుచుకుంటే రాబడి పెరుగుతుంది.. జీవనోపాధి లభిస్తుంది. 15 ఏళ్ల ఓ బాలుడు తన సమస్యను పరిష్కరించుకునే క్రమంలో మంచి ఐడియాతో బిజినెస్‌ ప్రారంభించి ఏకంగా రూ.100 కోట్ల కంపెనీని సృష్టించాడు. ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

బడికెళ్లే వయసులో కోట్లు విలువైన కంపెనీ నిర్మించటం అంత ఈజీ కాదు. వినటానికి కొంచెం వింతగానే అనిపిస్తున్నప్పటికీ ముంబైలో నివసిస్తున్న 15 ఏళ్ల గుజరాతీ బాలుడు తిలక్ మెహతా ఇది సాధ్యమని నిరూపించాడు. చదువుతో పాటు వ్యాపారాన్ని కొనసాగిస్తూ రెండేళ్లుగా విజయవంతంగా వ్యాపారాన్ని నడిపిస్తున్నాడు. తన సంస్థ ద్వారా దాదాపు 200 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. 

తిలక్‌మెహతా 2008లో గుజరాత్‌లో జన్మించాడు. వృత్తిరీత్యా తిలక్‌ తండ్రి విశాల్‌ ముంబయి వచ్చి కుంటుంబంతో సహా అక్కడే నివసిస్తున్నారు. విశాల్ ఒక లాజిస్టిక్స్ కంపెనీలో పనిచేస్తుండేవారు. తల్లి గృహిణి. తిలక్‌కు సోదరి కూడా ఉంది. తిలక్‌కు తన చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన ద్వారా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన వచ్చింది. ఒకరోజు ఆఫీస్‌ నుంచి అలసిపోయి వచ్చిన తండ్రిని తనకు కావాల్సిన స్టేషనరీ వస్తువులను తీసుకురమ్మని అడిగాడు. అప్పటికే అలసటగా ఉన్న విశాల్‌ అందుకు నిరాకరించారు. దాంతో తనే వెళ్లి అవసరమైన వస్తువులు తెచ్చుకున్నాడు. అయితే ఇక్కడే తనకు మంచి ఐడియా వచ్చింది. తనలాగే ఎంతోమంది పిల్లలు, పెద్దలు కొన్ని కారణాల వల్ల వారికి అవసరమైన స్టేషనరీ వస్తువులు తెచ్చుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని గ్రహించాడు. దాంతో సమస్యకు పరిష్కారం గురించి ఆలోచిస్తూ.. ఇంటికే పుస్తకాలు డెలివరీ చేసే సర్వీస్ ప్రారంభిస్తే బావుంటుందనే ఐడియా వచ్చింది. వెంటనే ఈ ఆలోచన గురించి తండ్రికి వివరించాడు. అలా తిలక్ తన కొరియర్ సర్వీస్ ప్రారంభించేందుకు అవసరమైన పూర్తి ప్రణాళిక సిద్ధమైంది. దీనికి అవసరమైన పెట్టుబడిని తన తండ్రి సమకూర్చారు.

ఇదీ చదవండి: అది నిరూపిస్తే చావడానికైనా సిద్ధమే: బాబా రామ్‌దేవ్

వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచనతో పెట్టుబడిదారుల కోసం వెతికారు. తండ్రి సహాయంతో తిలక్‌ ఓ బ్యాంకు అధికారికి తన వ్యాపారం గురించి వివరించాడు. దాంతో ఆ అధికారి తిలక్ ఆలోచన విని కొంత పెట్టుబడి పెట్టారు. తర్వాత బ్యాంకు ఉద్యోగం వదిలేసి తన వ్యాపారంలో చేరాడు. వీరంతా కలిసి ‘పేపర్స్‌ ఎన్ పార్సెల్స్‌’ పేరుతో కొరియర్ సర్వీస్‌ను ప్రారంభించారు.

  • పేపర్స్ ఎన్ పార్సెల్స్‌ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా షిప్పింగ్, లాజిస్టిక్స్ సేవలు అందిస్తున్నారు.
  • ఆన్‌లైన్‌లో బుక్‌ చేసిన అదేరోజు స్మాల్‌ పార్సెళ్లు, డాక్యుమెంట్లు, స్టేషనరీ వస్తువులు అందిస్తారు.
  • ఈ కంపెనీ ముంబయిలో సేవలు అందిస్తోంది.
  • ఇందులో 200 మంది పనిచేస్తున్నారు.
  • దాదాపు 300 మంది డబ్బావాలా ఉద్యోగాల సహకారంతో రోజూ 1200 డెలివరీలు ఇస్తున్నారు.
  • గరిష్ఠంగా 3 కిలోల వరకు బరువున్న పార్సెళ్లు చేస్తున్నారు.
  • ప్రతి పార్సెల్‌కు కనీసం రూ.40 నుంచి రూ.180 వసూలు చేస్తున్నారు.
  • ముంబయి ఇంట్రాసిటీ లాజిస్టిక్‌ మార్కెట్‌లో 20 శాతం వాటాను కలిగి ఉన్నారు.

Advertisement
 
Advertisement