రుద్రంపూర్: కొత్తగూడెంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జాబ్‌మేళా లో 13 మంది ఎంపికయ్యారు. ముత్తూట్ మైక్రో లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి జాబ్‌మేళా ఏర్పాటు చేయగా 24 మంది హాజరయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలన, ఇంటర్వ్యూల అనంతరం 13 మందిని ఎంపిక చేశారని జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు.
హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
భద్రాచలంఅర్బన్: పట్టణంలోని పలు హోటళ్ల లో ఫుడ్ సేఫ్టీ అధికారి శరత్ ఆధ్వర్యంలో బుధవారం తనిఖీలు చేపట్టారు. తినుబండారాల్లో కీటకాలు వస్తున్నాయనే ఫిర్యాదుల మేరకు సిబ్బందితో కలిసి హోటళ్లలోని అనుమానిత ఫుడ్ శాంపిళ్లను సేకరించారు. వీటిని ల్యాబ్‌కు పంపించి నివేదికలు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
ఫీవర్ సర్వే పక్కాగా చేపట్టాలి
జిల్లా మలేరియా అధికారి రాందాస్
భద్రాచలంఅర్బన్: జ్వర పీడితులను గుర్తించేందుకు పక్కాగా సర్వే చేపట్టాలని జిల్లా మలేరియా అధికారి రాందాస్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం భద్రాచలం పట్టణంలోని ఐటీడీఏ ప్రాంగణంలో గల మలేరియా కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. వర్షా కాలం సమీపించిన తరుణంలో ఏజెన్సీ ప్రాంతంలో సీజనల్, అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందని, ఇంటింటికీ తిరిగి ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించి, దోమల మందు పిచికారీ చేసి, వైద్యశిబిరాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రైడేను పాటించాలని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శ్రీధర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
క్రికెట్ టోర్నీలో కేటీపీఎస్ క్రీడాకారులు ప్రతిభ
పాల్వంచ: ఇటీవల భూపాలపల్లిలో జరిగిన టీజీ జెన్‌కో ఇంటర్ ప్రాజెక్ట్‌స్ క్రికెట్ టోర్నమెంట్‌లో కేటీపీఎస్ 7వ దశ క్రీడాకారులు విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా బుధవారం క్రీడాకారులను సీఈ జె.సూర్యనారాయణ అభినందించి మాట్లాడారు. క్రీడలపై ఆసక్తి ఉన్న ఉద్యోగులను ప్రోత్సహించడానికి యాజమా న్యం సిద్ధంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఈలు ఎస్.యుగపతి, డీఈ శేఖర్, గేమ్స్ సెక్రటరీ డి.శ్యాంసుందర్, కెప్టెన్ ఆరిఫ్, క్రీడాకారులు జి.నవీన్, ఎం.శ్రీనివాస్, వివేక్, అశోక్, విలాస్, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, ముతైర్ అహ్మద్, రమేశ్, భాను మహేశ్, శ్రీనివాస్, రాహుల్, భరత్, రామకృష్ణ,, శివ, మహే శ్, నాగరాజు పాల్గొన్నారు.
అధునాతన పద్ధతుల్లో చేపల పెంపకం
కూసుమంచి: మత్స్యకారులు, మత్స్య రైతులు ఆధునిక పద్ధతుల్లో చేపల పెంపకం చేపట్టడం ద్వారా అధిక ఉత్పత్తి సాధ్యమవుతుందని నాబార్డు డీడీఎం సుజిత్‌కుమార్ తెలిపారు. పాలేరులోని మత్స్య పరిశోధనా కేంద్రంలో ‘బయోప్లాక్ విధానంలో చేపల పెంపకం’అంశంపై ఇస్తున్న శిక్షణ బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా హాజరైన మత్స్య రైతులకు సర్టిఫికెట్లు అందజేశాక డీడీఎం మాట్లాడుతూ.. డిమాండ్‌కు తగ్గట్టు చేపల ఉత్పత్తి జరగాలంటే నూతన విధానాలు ఎంచుకోవాలని సూచించారు. ఇందుకోసం శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అలాగే, మత్స్యకారుల కోసం నాబార్డు అందిస్తున్న పథకాలను వివరించారు. కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్, శాస్త్రవేత్తలు శాంతన్న, రవీందర్, దివ్య, చొప్పరి రాంచంద్రం, అనిల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వడదెబ్బతో వ్యక్తి మృతి
నేలకొండపల్లి: మండలంలోని చెన్నారం గ్రామంలో వడదెబ్బకు గురై బుధవారం వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన నాగయ్య (40) ఎండ తీవ్రత తట్టుకోలేక అస్వస్థతకు గురై మృతిచెందాడు.


