నిరంతర విద్యుత్ సరఫరా
ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూసేందుకు నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(ఎన్పీడీసీఎల్) ప్రత్యేకంగా ‘హైపర్’ యాక్షన్ ప్లాన్‌ను రూపొందించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరణను వేగంగా చేపట్టడం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు. – ఖమ్మంవ్యవసాయం
● భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యాన అప్రమత్తంగా ఎన్పీడీసీఎల్ ● అంతరాయాలు లేని విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు
ఆరు అంచెల వ్యూహం
విద్యుత్ స్తంభించిన వెంటనే సత్వర పునరుద్ధరణ కోసం ఆరు అంచెల విధానం రూపొందించారు. ప్రధాన కార్యాలయంలోని 24 గంటల కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తూ సిబ్బందికి బాధ్యతలు కేటాయిస్తారు. ప్రధాన ప్రాంతాల్లో అప్పటికే సిద్ధంగా ఉన్న సిబ్బంది మరమ్మతు సామగ్రితో అంతరాయం ఎదురైన ప్రాంతానికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తారు. తద్వారా త్వరగా విద్యుత్ పునరుద్ధరణ జరుగుతుంది.
ముందే గుర్తింపు
ఎస్‌సీఏడీఏ, జీఐఎస్, ఓఎంఎస్ వంటి డేటా వ్యవస్థలను కృత్రిమ మేధస్సుతో అనుసంధానించారు. దీంతో ఫీడర్లలో వచ్చే సాంకేతిక లోపాలను 7 – 21 రోజుల ముందే గుర్తించవచ్చు. వాతావరణం ఆధారంగా విద్యుత్ డిమాండ్‌ను అంచనా వేసి సరఫరా నిర్వహిస్తారు. అంతేకాక అటవీ ప్రాంతాలు, ఇరుకై న ప్రదేశాల్లో లైన్ల పర్యవేక్షణకు డ్రోన్లను వినియోగించనున్నారు.
ఎమర్జెన్సీ వాహనాలు
విద్యుత్ అత్యవసర పునరుద్ధరణ కోసం జీపీఆర్‌ఎస్ బృందాల వాహనాలు అందుబాటులో ఉంచారు. వీటిలో మరమ్మతులకు కావాల్సిన అన్ని పరికరాలు ఉంటాయి. జీపీఆర్‌ఎస్ ట్రాకింగ్‌తో కంట్రోల్ రూమ్ నుంచి వాహన స్థానాన్ని గుర్తించిసిబ్బందిని త్వరగా పంపించి పనులు చేపడుతారు.
‘హైపర్’ యాక్షన్ ప్లాన్‌తో వర్షాకాలంలో విద్యుత్ అంతరాయాలు గణనీయంగా తగ్గే అవకాశముంది. తద్వారా నియోగదారులకు నిరంతర విద్యుత్ అందుతుంది. ఈ యాక్షన్ ప్లాన్‌ను జిల్లాలో అమలుకు చర్యలు తీసుకుంటున్నాం.
–ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎస్‌ఈ, ఖమ్మం


