వైద్యులు కావలెను... | - | Sakshi
Sakshi News home page

వైద్యులు కావలెను...

Jun 18 2026 12:11 AM | Updated on Jun 18 2026 12:11 AM

త్వరలోనే భర్తీ చేస్తాం

భద్రాచలంఅర్బన్‌: నాలుగు రాష్ట్రాలకు కూడలిగా ఉన్న భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ఏళ్ల తరబడి వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో బాధితులకు పూర్తిస్థాయిలో వైద్యం అందడంలేదు. 200 పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రిలో వైద్యులు, నర్సింగ్‌, పారామెడికల్‌, అడ్మినిస్ట్రేటివ్‌ విభాగాల్లో మొత్తం 212 పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 93 మందే పనిచేస్తున్నారు. ఇంకా 119 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే, 63 డాక్టర్‌ పోస్టులు ఉండగా, కేవలం ఆరుగురు రెగ్యులర్‌, 13 మంది కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. ఇంకా 44 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నర్సింగ్‌ పోస్టులు 53 ఉండగా, ఐదుగురు రెగ్యులర్‌ సిబ్బంది ఉన్నారు. ఇంకా 48 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.

అసలే కొరత.. అయినా డిప్యూటేషన్లు

ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత ఉన్నా, ఉన్న వారిలో కొందరిని ఇతర ఆస్పత్రులకు డిప్యూటేన్‌పై పంపించారు. ఉన్న 19 మంది డాక్టర్లలో పలువురు డిప్యూటేషన్‌పై ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. ఇతర విభాగాల్లోని సిబ్బంది కూడా డిప్యూటేషన్‌పై వెళ్లారు. ఇక భద్రాచలంలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, నర్సింగ్‌ సిబ్బందిలో చాలా మంది కూడా ఇతర ఆస్పత్రుల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన వారే. దీంతో రోగులకు పూర్తి స్థాయిలో వైద్యసేవలు అందడంలేదు. పని భారం పెరగడంతో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పని చేసేందుకు కూడా వైద్యులు ముందుకు రావడం లేదు. వైద్యులు, సిబ్బంది కొరత వల్ల సుదూర ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చిన పేదలు ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లాల్సివస్తోంది. రూ. వేలకు వేలు బిల్లులు చెల్లించలేక అవస్థ పడుతున్నారు.

సేవలు అంతంతే

200 పడకలు ఉన్న భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలు, అన్ని విభాగాలతో కూడిన వార్డులు, పక్కా భవనం ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల నుంచి పేదలు వైద్య సేవల కోసం ఇక్కడికి వస్తుంటారు. వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా పూర్తిస్థాయిలో వైద్యం అందడంలేదు. ఎమ్మెల్యే, ఐటీడీఏ పీఓ స్పందించి ఖాళీపోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

భద్రాచలం ఆస్పత్రిలో ఖాళీ పోస్టుల సమస్యను కలెక్టర్‌, ఐటీడీఏ పీఓల దృష్టికి తీసుకెళ్లాం. ప్రస్తుతం అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించేందుకు సమస్య లేకుండా చర్యలు తీసుకున్నాం. త్వరలోనే అన్ని విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తాం. – డాక్టర్‌ రవిబాబు నాయక్‌,

డీసీహెచ్‌ఎస్‌

గుండాల మండలం శంభునిగూడెం నుంచి గర్భిణి దాట్ల వనజను గత ఆదివారం గుండాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కానీ ఈ ఆస్పత్రిలో ఇద్దరు వైద్యులకు గాను ఒకరే విధులు నిర్వర్తిస్తుండడంతో గర్భిణి తీసుకొచ్చిన సమయాన ఆ వైద్యుడు కూడా లేడు. దీంతో స్టాఫ్‌ నర్స్‌ వైద్యం చేయడంతో అపస్మారకస్థితికి చేరిన శిశువును ఇల్లెందుకు తీసుకెళ్లగా కన్నుమూసింది. ఆపై గర్భిణికి తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో ఖమ్మం తీసుకెళ్లి చికిత్స చేయిస్తుండగా మృతి చెందింది. గర్భిణిని ఆస్పత్రికి తీసుకొచ్చిన సమయాన వైద్యుడు ఉంటే వనజ ఇంట్లో ఈపాటికి చిన్నారి అడుగిడిన సంబురం అంబరాన్ని అంటేది. కానీ అటు భార్య, కళ్లు తెరవని బిడ్డను కోల్పోయిన ఆమె భర్త, కుటుంబీకులు విషాదం నుంచి తేరుకోలేకపోతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement