212 పోస్టులకు 93 మందే విధులు
బాధితులకు పూర్తిస్థాయిలో అందని వైద్యం
జూలూరుపాడు: జూలూరుపాడు పీహెచ్‌సీని వైద్యసిబ్బంది కొరత వేధిస్తోంది. ఇటీవల పలువురు స్టాఫ్ నర్సులు బదిలీ కాగా, ఇక్కడకు పోస్టింగ్ ఇచ్చిన వారు చేరేందుకు ఆసక్తి చూపడం లేదని తెలిసింది. స్టాఫ్ నర్సులు లేక ఏఎన్‌ఎంలే వైద్యసేవలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఇద్దరు వైద్యులు, ఫార్మసిస్టు, ఎల్‌టీ, ఏఎన్‌ఎంలు ఉన్నారు. ఇక్కడ నలుగురు వైద్యులు, ఒక హెడ్‌నర్సు, ఆరుగురు స్టాఫ్ నర్సులు పని చేయాల్సి ఉన్నా ఇద్దరు డాక్టర్లు డిప్యూటేషన్‌పై కొత్తగూడెం వెళ్లగా, హెడ్ నర్సు రెండేళ్ల క్రితం డిప్యూటేషన్‌పై ఖమ్మం వెళ్లారు. అంతేకాక నలుగురు స్టాఫ్ నర్సులు ఇటీవల బదిలీ అయ్యారు. వీరి స్థానాల్లో కొత్తగా ఎవరినీ నియమించడంతో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే, పలు సబ్‌సెంటర్లలోనూ ఏఎన్‌ఎం పోస్టుల భర్తీ జరగలేదు. ఆస్పత్రి స్టాఫ్ నర్సులు లేక షిఫ్ట్‌ల వారీగా ఏఎన్‌ఎంలే విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. వైద్యులు కూడా ఇద్దరే నెట్టుకొస్తున్నారు. ఇక ఏడాదిన్నరగా డెంటల్ డాక్టర్ లేక ఆ విభాగమే మూతపడింది.
గుండాల ఆస్పత్రిలో ఇక్కట్లు
గుండాల: మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల 50 గ్రామాలకు గుండాల ప్రభుత్వ ఆస్పత్రే పెద్దదిక్కు. కానీ కొంత కాలంగా వైద్యాధికారితో పాటు ఇతర సిబ్బంది కొరతతో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఇద్దరు వైద్యాధికారులకు ఒకరే ఉండడం.. ఆయన సమావేశాలు, శిబిరాలకు వెళ్లినా, సెలవు పెట్టినా ఆస్పత్రిలో ఓపీ చూసే వారుండరు. అత్యవసర సమయాల్లో మృత్యువుతో పోరాడుతూ పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. పేరుకు 24 గంటల ఆస్పత్రే అయినా వైద్యలు, సిబ్బంది నియామకంపై ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి పెట్టకపోవడంతో ఏజెన్సీ వాసులకు ప్రభుత్వ వైద్యం సక్రమంగా అందడం లేదు. గతంలో ఇక్కడ ఇద్దరు వైద్యులు ఉన్నా డాక్టర్ మనేష్‌రెడ్డి ఉన్నత చదువుల కోసం వెళ్లగా ఒకరే కొనసాగుతున్నారు. ఇక నలుగురు స్టాఫ్ నర్సులకు గాను ముగ్గురు బదిలీపై వెళ్లారు. అలాగే, ఫార్మసిస్ట్ కూడా లేరు. మరోపక్కసాయనపల్లి, ముత్తాపురం సబ్‌సెంటర్లకు ఏఎన్‌ఎమ్‌లు బదిలీపై వెళ్లగా వారి స్థానంలో కొత్త వారిని నియమించలేదు.
పోలీసుస్టేషన్‌లో అంబులెన్స్
గతంలో గుండాల ప్రభుత్వ ఆస్పత్రికి రెండు 108 వాహనాలను కేటాయించగా, ఒకటి ఏడాది క్రితం ఇల్లెందుకు పంపించారు. ఆపై ఒక అంబులెన్స్ కొనసాగినా ఇటీవల జరిగిన ప్రమాదంతో ఇల్లెందు పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. ఫలితంగా ఎవరైనా ఆపదలో ఉంటే పక్క మండలం నుంచి అంబులెన్స్ రావాల్సిందే. ఇటీవల శంభునిగూడెం గర్భిణికి పురిటినొప్పులు వస్తున్నా అంబులెన్స్ లేక ఆమె ఆస్పత్రికి తీసురావడంలో జాప్యం జరిగి తల్లీబిడ్డ మృతి చెందినట్లు చెబుతున్నారు. ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత, అంబులెన్స్ లేకపోవడం వంటి సమస్యలపై అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంపై గిరిజన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం వచ్చినందున సీజనల్ వ్యాధుల ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడైనా స్పందించి సరిపడా వైద్యులు, సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు.
భద్రాచలం ఏరియా ఆస్పత్రిని వేధిస్తున్న కొరత


