మణుగూరుటౌన్: ప్రతీ ఉద్యోగి రక్షణ సూత్రాలు పాటించడమే కాక యంత్రాల పనిగంటలు పెంచడం ద్వారా బొగ్గు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించొచ్చ ని సింగరేణి డైరెక్టర్లు సత్యనారాయణ, కొప్పుల వెంకటేశ్వర్లు తెలిపారు. మణుగూరులో బుధవారం జరిగిన త్రైపాక్షిక రక్షణ సమావేశంలో వారు పాల్గొన్నారు. తొలుత రక్షణ ప్రతిజ్ఞ చేయగా, డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రతీ గనిలో రక్షణపై ఉద్యోగులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం మరో డైరెక్టర్ వెంకటేశ్వ ర్లు మాట్లాడుతూ.. కోల్ ఇండియాతో పోలిస్తే ఎక్కువగా ఉన్న సింగరేణి బొగ్గు ధర తగ్గించేలా యంత్రా ల పనిగంటలను పెంచితే ఉత్పత్తి వ్యయం నియంత్రణలోకి వస్తుందని తెలిపారు. అలాగే, ఈ ఆర్థిక సంవత్సరం ఉత్పత్తి లక్ష్యమైన 65 మిలియన్ టన్నులు సాధించేందుకు ఉద్యోగులందరూ సమష్టి కృషి చేయాలని సూచించారు. ఇంకా ఈ సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్లు హరిప్రసాద్, నాగుల్ మీరా, బొల్లు సుధీర్‌కుమార్‌తో పాటు జీఎం(సేఫ్టీ) కార్పొరేట్ సాయిబాబు, ఏరియా జీఎం దుర్గం రాంచందర్ మాట్లాడగా, పలు విభాగాల అధికారులు కృష్ణగోపాల్‌తివారీ, మదన్‌నాయక్, రామారావు, ఎస్.రమేశ్, రాంబాబు, శ్రీనివాసాచారి, శ్రీనివాస్, రామన్ పాఠక్, శివ ప్రసాద్, శ్రీకాంత్, దయాకర్, రమేశ్‌బాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


