ఇల్లెందురూరల్: ప్రభుత్వం యూరియా సరఫరాకు ప్రవేశపెట్టిన యాప్ రైతులకు మేలు చేస్తుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబూరావు తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రీ, యాప్ తదితర అంశాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉన్నతాధికారులు మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు ఆయన మండలంలోని చల్లసముద్రం రైతు వేదిక నుంచి హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ యాప్ ద్వారా రైతులు తమ ప్రాంతంలో యూరియా లభ్యత తెలుసుకునే అవకాశం ఏర్పడుతుందని, తద్వారా అనుకూలమైన సమయంలో తీసుకునేలా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. అంతేకాక పంపిణీలో పారదర్శకత, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టడం సాధ్యమవుతుందని చెప్పారు. కాగా, వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలతో ముకుందాపురం రైతు వడ్డె మహేష్ మాట్లాడారు. రబీలో వరి సాగు చేసిన తాను యాప్ ద్వారా సులభంగా యూరియా కొనుగోలు చేశానని తెలిపారు. ఈకార్యక్రమంలో ఏడీఏ లాల్‌చంద్, ఏవో సతీష్, ఏఈఓ సందీప్, ఫెర్టిలైజర్ డీలర్ల సంఘం బాధ్యులు నాళ్ల సోమసుందర్, వ్యామసాని జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.


