సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజా సమస్యలు పరి ష్కరించి సత్వర సేవలు అందించడమే ప్రజావాణి లక్ష్యమని కలెక్టర్ అంకిత్ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డీఆర్‌ఓ పద్మావతితో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. పరిశీలించి, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ప్రతీ వినతిని ప్రాధాన్యతతో పరిష్కరించాలని చెప్పారు.
ప్రజావాణి దరఖాస్తుల్లో కొన్నింటి వివరాలు
● టేకులపల్లి మండలం మొక్కంపాడు తండాకు చెందిన భూక్య సుమన్ తాను పుట్టుకతోనే దివ్యాంగుడినని, అద్దె ఇంటిలో నివసిస్తూ జీవనం సాగించడం కష్టతరంగా మారిందని, ఇందిరమ్మ గృహం మంజూరు చేయాలని దరఖాస్తు చేయగా గృహ నిర్మాణ శాఖ పీడీకి ఎండార్స్ చేశారు.
● ములకలపల్లి మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన స్వప్న వ్యవసాయ బోరు, విద్యుత్ సదుపాయం మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేయగా కలెక్టర్ పరిష్కారానికి ఐటీడీఏ పీఓకు ఎండార్స్ చేశారు.
● ఇల్లెందు మండలం ధనియాలపాడు గ్రామ పరిధిలోని బాలాజీ తండాకు చెందిన బానోత్ అనూష తనకు సంబంధించిన రెండు వేర్వేరు భూముల భూభారతి రిజిస్ట్రేషన్ దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని దరఖాస్తు చేయగా ధరణి అధికారులకు ఎండార్స్ చేశారు.
పారదర్శకత పాటించాలి
జిల్లాలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. రెండో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై కలెక్టరేట్‌లో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, గృహనిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెండో విడతలో ప్రతీ నియోజకవర్గానికి 2 వేలు ఇళ్లు మంజూరయ్యాయని, అర్హులను ఎంపిక చేయాలని ఆదేశించారు. పూరి గుడిసెలు, నివాసయోగ్యం కాని ఇళ్లు, వివరాలను సేకరిస్తూ ఎంపికల్లో పారదర్శకత పాటించాలని అన్నారు. ఆధార్ నవీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, గృహ నిర్మాణ శాఖాధికారి సవేరామ్ తదితరులు పాల్గొన్నారు.
విద్య, వైద్య రంగాలకు
సీఎస్‌ఆర్ నిధుల్లో ప్రాధాన్యం..
జిల్లాలో విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధుల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లాలోని సింగరేణి, కేటీపీఎస్, నవభారత్, ఐటీసీ తదితర పరిశ్రమల ప్రతినిధులతో సీఎస్‌ఆర్ నిధుల ద్వారా అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టాల్సిన కొత్త పనులపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల్లో సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సీపీఓ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యనందించాలి
పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ఎంఈఓలదేనని కలెక్టర్ అంకిత్ అన్నారు. కలెక్టరేట్‌లో ఎంఈఓలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు, బడిబాట కార్యక్రమం, ఏకరూప దుస్తుల పంపిణీ, పాఠ్యపుస్తకాల పంపిణీ, అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల పురోగతి, ఆధార్ అప్‌డేషన్, అపార్ నమోదు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. బడిబాట కార్యక్రమంలో నిర్దేశించిన 60,415 అడ్మిషన్ల లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు. మహిళా సంఘాలు, ప్రజాప్రతినిధులు, అంగన్‌వాడీ కార్యకర్తలతో సమన్వయంతో అడ్మిషన్లు పెంచాలన్నారు. జీరో ఎన్‌రోల్‌మెంట్ ఉన్న 10 ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఇన్‌చార్జ్ డీఈఓ శంభు ప్రసాద్, విద్యాశాఖ కోఆర్డినేటర్లు సతీష్, నాగశేఖర శర్మ పాల్గొన్నారు.
కలెక్టర్ అంకిత్


