భద్రాచలంఅర్బన్/అశ్వాపురం: మండలంలోని బీజీ కొత్తూరు సమీపంలో మణుగూరు – కొత్తగూడెం ప్రధాన రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. భద్రాచలానికి చెందిన మల్లెల సత్యసాయి (32) సిరి ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి ఏపీ 03 టీఈ 4189 నంబర్ గల టెంపో ట్రావెలర్‌లో 11 మంది ప్రయాణికులతో భద్రాచలం నుంచి మణుగూరుకు వెళ్తుండగా వాహనంలో డీజిల్ అయిపోవడంతో రోడ్డుపక్కన ఆపాడు. అనంతరం సత్యసాయి వాహనం దిగి రోడ్డుపక్కన నిలబడి ఫోన్ మాట్లాడుతుండగా, మొండికుంట వైపు నుంచి అతివేగంగా వచ్చిన బుల్లెట్ ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన అతడిని 108లో భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బైక్ నడుపుతున్న జానంపేటకు చెందిన కోసూరి సుభాష్ నిర్లక్ష్యంగా, అతివేగంగా వాహనం నడపడం వల్లే తన భర్త మృతి చెందాడని మృతుడి భార్య స్వర్ణముఖి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్ రెడ్డి తెలిపారు. ఇదిలాఉండగా.. సత్యసాయి మృతదేహంతో అతడి భార్య, కుటుంబ సభ్యులు భద్రాచలంలోని సిరి ట్రావెల్స్ కార్యాలయం ఎదుట ఆదివారం మధ్యాహ్నం ఆందోళన చేపట్టారు. మృతుడి పిల్లలకు ఆర్థిక సాయం అందిస్తామని ట్రావెల్స్ నిర్వాహకులు ఒప్పుకోవడంతో ఆందోళన విరమించారు.
బావిలో పడి యువకుడు..
దమ్మపేట: మద్యానికి బానిసైన, మానసిక స్థితి సరిగాలేని యువకుడు బావిలో పడి మృతి చెందిన ఘటనపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. దమ్మపేటకు చెందిన జుజ్జూరి లక్ష్మీనారాయణ(30)కు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు వైద్యం చేయిస్తున్నారు. శనివారం నుంచి కనిపించకపోవడంతో కుటుంబీకులు పలుచోట్ల వెతికగా, వారి ఇంటి సమీపంలోని బావిలో విగతజీవిగా కనిపించాడు. ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడని కుటుంబీకులు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజేష్‌కుమార్ తెలిపారు.
కరకట్ట కందకంలో పడి..
ఖమ్మంక్రైం: వరద ముంపు రాకుండా మున్నేటి వద్ద నిర్మిస్తున్న కరకట్ట కందకంలో ప్రమాదవశాత్తు పడిన ఓ యువకుడు మతి చెందాడు. ఖమ్మం సుందరయ్యనగర్ ప్రాంతానికి చెందిన వనమాల కృష్ణ చిన్నకుమారుడు జయశంకర్ (21) ఇంటర్ తర్వాత ఇంటి వద్దే ఉంటున్నాడు. ఆయన శనివారం మధ్యాహ్న భోజనం చేశాక బయటకు వెళ్తున్నానని తల్లి, సోదరుడికి చెప్పి బయలుదేరాడు. అయితే, రాత్రి వరకు తిరిగి రాకపోవడం, సెల్‌ఫోన్ కూడా ఇంట్లోనే ఉండడంతో స్నేహితుల వద్ద ఆరా తీసినా ఫలితం కానరాలేదు. ఈ మేరకు ఆదివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తుండగా, మున్నేటి కరకట్ట కోసం తవ్విన 20 అడుగుల లోతు కందకంలో జయశంకర్ మృతదేహం తేలుతోందన్న సమాచారంతో వెళ్లిన కుటుంబీకులు కన్నీరమున్నీరయ్యారు. కందకంలో చేతులు కడుక్కోవటానికి వెళ్లిన ఆయన ప్రమాదవశాత్తు పడగా, ఈత రాకపోవడంతో మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించగా, జయశంకర్ తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఖమ్మం త్రీటౌన్ సీఐ మోహన్‌బాబు తెలిపారు.
మహిళపైకి దూసుకొచ్చిన అంబులెన్స్
ఇల్లెందు: మద్యం మత్తులో అంబులెన్స్ డ్రైవర్ ఓ మహిళపైకి దూసుకెళ్లాడు. ఇల్లెందులోని జగదాంబసెంటర్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. అంబులెన్స్ డ్రైవర్ వేగంగా నడుపుతూ మహిళపైకి దూసుకెళ్లడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఈ మేరకు స్థానికులు ఆమెను అంబులెన్స్ కింది నుంచి బయటికి లాగి ఆస్పత్రికి తరలించారు.
వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి
మణుగూరుటౌన్: మున్సిపాలిటీలోని సురక్షా బస్టాండ్ సమీపంలో రోడ్డు దాటుతున్న ఓ వృద్ధురాలిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో వృద్ధురాలి రెండు కాళ్లు నుజ్జునుజ్జుకాగా.. భారీ వాహనం వృద్ధురాలి పైనుంచి వెళ్లిన ఆనవాళ్లు ఉన్నాయి. రాత్రివేళ కావడం లారీలు వేగంగా దూసుకురావడం వల్ల ఇలా జరిగిందా లేదా మరేదైనా వాహనం ఢీకొన్నదా అన్నది తెలియరాలేదు.


