పదిరోజుల్లో ఏడు మేకలు చోరీ | - | Sakshi
Sakshi News home page

పదిరోజుల్లో ఏడు మేకలు చోరీ

Jun 15 2026 12:17 AM | Updated on Jun 15 2026 12:17 AM

ఆందోళన చెందుతున్న ప్రజలు

ఇల్లెందు: గడిచిన పదిరోజుల్లో మండలంలోని పలు గ్రామాల నుంచి ఏడు మేకలను దుండగులు అపహరించారు. మండలంలోని మాణిక్యారం, కొమరారం, బోయితండా, పోచారం, మసివాగుతండాలో నలుగురు వ్యక్తులు రెండు బైక్‌లపై సంచరిస్తూ ఆవరణలో కట్టేసి ఉంచిన మేకలను ఎత్తుకెళ్తున్నారు. తుంటిబాలుతండాలో బానోతు రమేశ్‌ మేకపోతు, ఎల్లాపురంలో జి.కృష్ణ ఇంట్లో నంచి ఒకటి, మిట్టపల్లిలో జి.రాందాస్‌కు చెందిన రెండు, పోచారంతండాలో లక్ష్మణ్‌కు చెందిన ఒకటి, మసివాగులో రెండు మేకలు చోరీకి గురయ్యాయని తెలిపారు. కాగా తుండాబాలుతండాలో ఓ ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలో చోరీ ఘటన రికార్డయింది. ఇద్దరిద్దరు కలిసి రెండు బైక్‌లపై రావడం, ఇంటి ఆవరణలో కట్టేసి ఉంచిన మేకలను ఎత్తుకెళ్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఓ నిందితుడు కెమెరాకు చిక్కాడు.

వృద్ధుడి అదృశ్యం

టేకులపల్లి: ఖమ్మం జిల్లా సింగరేణి మండలం మాణిక్యారం గ్రామ పరిధి గుడితండాకు చెందిన బానోతు సక్రు (70) ఈ నెల 10వ తేదీన ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన అల్లుడు, టేకులపల్లికి చెందిన గుగులోత్‌ కిషన్‌ ఆదివారం తెలిపారు. కొత్తగూడెం నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే రైలు చీమలపాడు స్టేషన్‌లో ఎక్కినట్లు తెలుస్తుండగా, ఆ తర్వాత సక్రు ఆచూకీ తెలియరాలేదని వెల్లడించాడు. ఆయన ఆచూకీ తెలిసిన వారు 79934 48485, 83415 21726 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కిషన్‌ కోరాడు

ఉద్యోగాల పేరుతో టోకరా

దమ్మపేట: సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మండలంలోని ముష్టిబండకు చెందిన ముగ్గురు యువకులను హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి మోసం చేయగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. కొద్ది నెలల కిందట మండలంలోని ముష్టిబండ గ్రామానికి చెందిన హర్షవర్దన్‌తో పాటు మరో ఇద్దరు యువకులకు హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని అమర్‌నాథ్‌ అనే వ్యక్తి నమ్మబలికి, వారి వద్ద నుంచి రూ.5,40,000 వసూలు చేశాడు. అనంతరం హైదరాబాద్‌లోని మున్నా అనే వ్యక్తికి చెందిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పించాడు. వారు ఆ కంపెనీలో ఐదు నెలల పాటు పనిచేసినప్పటికీ వేతనాలు చెల్లించకపోగా, మరో మంచి కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఆ ఉద్యోగాలకు రిజైన్‌ చేయించాడు. అప్పటి నుంచి నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో బాధిత యువకులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ రాజేశ్‌కుమార్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement