ఆరంభం ఇలా..
థర్మల్ విద్యుత్, ఇతర కంపెనీలకు సంస్థల వారీగా బొగ్గు అమ్ముతున్న ధరలు (టన్నుకు రూ.ల్లో)
సంస్థపై సాలీనా రూ.200 కోట్లు అదనం
భారం తగ్గించుకోవాలని భావిస్తున్న యాజమాన్యం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దేశంలో గ్రేడ్–5 (జీ–5) నుంచి గ్రేడ్–17 రకం వరకు బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఇందులో జీ–5 మేలి రకం కాగా జీ–17 నాసిరకం బొగ్గుగా పరిగణిస్తారు. సింగరేణిలో సగటు గ్రేడ్ జీ–3గా ఉంది. మరోవైపు టన్ను బొగ్గు ఉత్పత్తికి సింగరేణిలో సగటున రూ.4,700 ఖర్చు అవుతుండగా కోలిండియాలో రూ.2,600గానే ఉంది. తద్వారా తక్కువ ధరకు నాణ్యమైన బొగ్గు బహిరంగ మార్కెట్‌లో అందుబాటులో ఉండటంతో ప్రభుత్వ రంగ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు సింగరేణి బొగ్గును కొనేందుకు తటపటాయిస్తున్నాయి. భవిష్యత్‌కు ఇది ఒక ప్రమాదకర సంకేతంగా సింగరేణి యాజమాన్యం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్పత్తి వ్యయం తగ్గిస్తే తద్వారా మార్కెట్‌లో తోటి కంపెనీలతో పోటీ పడవచ్చని యోచిస్తోంది.
రొటేషన్ పద్ధతిలో వారాంతపు సెలవు!
ప్రస్తుతం సింగరేణిలో ఇల్లెందు ఏరియాను (శుక్రవారం) మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల ఆదివారం సెలవు దినంగా ఉంది. ఆ రోజు కూడా పని చేసే కార్మికులకు ప్లే డే విధానం అమలు చేస్తుండగా, రెట్టింపు వేతనం అందుతుంది. సదరు సెలవు దినాన్ని మరో రోజు వాడుకునే వీలు ఉంది. దీనివల్ల ఏడాదికి రూ.200 కోట్ల వరకు ఖర్చు అవుతోందని, రాబోయే వేజ్‌బోర్డు అమల్లోకి వస్తే ప్లే డే ఖర్చు రెట్టింపు కావడం ఖాయమని యాజమాన్యం ఆందోళన చెందుతోంది. దీంతో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి సూచించినట్టు ఆదివారం ప్లేడే ఇచ్చే బదులు రైల్వేస్, ఆర్టీసీ తరహాలో రొటేషన్ పద్ధతిలో వారాంతపు సెలవు విధానం అమలు చేసే అంశాన్ని సంస్థ పరిశీలిస్తోంది.
ప్లే డే కేటాయింపులోనూ అవకతవకలు!
గడిచిన రెండు దశాబ్దాల కాలంలో సింగరేణిలో యాంత్రీకరణ పెరిగింది. భూగర్భ గనుల కంటే ఉపరితల గనుల నుంచే ఎక్కువ బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. భూగర్భ గనుల్లో సైతం కంటిన్యూస్ మైనర్‌లు ఉన్న చోట ప్రైవేట్ సంస్థలే అత్యంత ముఖ్యమైన పనులు చేస్తున్నాయి. మరోవైపు కంప్యూటరీకరణ పెరిగిపోయిన తర్వాత నిర్వహణ సైతం సులువుగా మారింది. అయినా ప్లే డే విధానం గతంలో తరహాలోనే కొనసాగుతోంది. హైదరాబాద్‌లో ఉన్న సింగరేణి భవన్‌లో సుమారు వంద మంది ఉద్యోగులు పని చేస్తుంటే ఇందులో కనీసం నాలుగో వంతు మంది ప్రతీ వారం ప్లే డేలు పొందుతున్నారు. కొన్ని గనుల్లో ఉన్నత స్థాయి అధికారులకు ఎంతో కొంత సమర్పిస్తూ, వారి ఇంటి పనులు చేస్తూ ప్లే డేలు పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం డిప్యూటేషన్ల అంశంపై దృష్టి సారించిన సింగరేణి యాజమాన్యం ఆ తర్వాత ప్లేడేలపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.
తొలినాళ్లలో ప్రమాదకర పరిస్థితుల మధ్య పనిచేసే గని కార్మికుల్లో భయం పోగొట్టేందుకు, విభిన్న ప్రాంతాల కార్మికుల మధ్య ఐక్యత సాధించేందుకు ఆటల పోటీలు నిర్వహించి, వేతనం చెల్లించేవారు. దీన్ని ప్లే డేగా అప్పట్లో బ్రిటీషర్లు పేర్కొన్నట్టు సీనియర్ కార్మికులు చెబుతుంటారు. ఆ తర్వాత 90వ దశకంలో ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చాక బొగ్గుకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. సెలవు రోజుల్లో కూడా కార్మికులు పని చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఫలితంగా విధులకు గైర్హాజర్ కాకుండా పని చేసిన కార్మికులకు వాచీలు, లంచ్ బాక్స్‌లు, సైకిళ్లను బహుమతులుగా ఇచ్చారు. ఇదే క్రమంలో ప్లే డే విధానం తిరిగి తెర మీదకు వచ్చింది. అప్పట్లో సంస్థలో కార్మికులు, ఉద్యోగులు లక్ష మందికి పైగా ఉండేవారు. నాలుగు వందలకు పైగా కార్మిక సంఘాలు ఉండేవి. అందరినీ అధిక ఉత్పత్తి లక్ష్యం దిశగా నడిపించేందుకు ఉత్పత్తితో ప్రత్యక్ష, పరోక్ష సంబంధం ఉన్న మెజారిటీ కార్మికులు, ఉద్యోగులకు ప్లే డేలు ఉపయోగపడ్డాయి. కాగా, ఇప్పుడు దుర్వినియోగం అవుతున్నాయనేది కార్మికుల మాటగా ఉంది.
గ్రేడ్ కోలిండియా వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ సింగరేణి
జీ–5 4,412 5,031 8,519
జీ–7 3,180 4,387 7,322
జీ–10 1,882 2,750 4,774
జీ–15 1,095 1,879 2,899
జీ–17 894 1,638 2,703
సింగరేణికి భారంగా మారిన ఉత్పత్తి వ్యయం


