మంత్రి పొంగులేటి నాకు గాడ్‌ఫాదర్!
ఎమ్మెల్యే జారె ఆదినారాయణ వెల్లడి
అశ్వారావుపేటరూరల్: రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాజకీయంగా దిక్కుతోచనిస్థితిలో ఉన్న తనను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కున చేర్చుకున్నారని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ వెల్లడించారు. శుక్రవారం అశ్వారావుపేటలోని కాసాని గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు పొంగులేటి గాడ్‌ఫాదర్ లాంటివారని, డిప్యూటీ సీ ఎం భట్టి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలతోనూ సత్సంబంధాలే ఉన్నాయని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో విద్య, వైద్యం, సాగునీటి విభాగాలకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నానని, అశ్వారావుపేటలో కొద్ది రోజుల క్రితమే రూ.200 కోట్లతో అత్యాధునిక సదుపాయాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలకు శంకుస్థాపన చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, అశ్వారావుపేటలో మెడికల్ కళాశాల మంజూరు అయిందని, త్వరలోనే నర్సింగ్ కళాశాల, ఏటీసీ (అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కళాశాల)ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. అటవీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తానని, దిబ్బగూడెంలో మొబైల్ ఆస్పత్రి, ప్రత్యేకంగా అంబులెన్స్‌తోపాటు దమ్మపేట మండలంలోని పట్వారీగూడెం, ములకలపల్లి పీహెచ్‌సీలను సీహెచ్‌సీలుగా అప్‌గ్రేడ్ చేయడంతోపాటు యర్రగుంటపల్లిలో 50 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని వివరించారు. చండ్రుగొండ మండలంలోని వెంగళరాయసాగర్‌ను రూ.34కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని, త్వరలోనే ములకలపల్లి మండలంలోని మూకమామిడి ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, పెద్దవాగు ప్రాజెక్టును రూ.19 కోట్లతో పున:నిర్మాణానికి ప్రతిపాదన ఉండగా తెలంగాణ వాటా రూ.3 కోట్లు, ఏపీ వాటా కింద రూ.16 కోట్లు మంజూరు దశలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో జూపల్లి రమేశ్‌బాబు, సీహెచ్ సత్యనారాయణ, తుమ్మా రాంబాబు, జూపల్లి ప్రమోద్, తాడేపల్లి రవి, విజయ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.


