భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో రామయ్య నిత్యకల్యాణం కనుల పండువగా సాగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. అదేవిధంగా స్వామివారికి బేడా మండపంలో స్నపన తిరుమంజనం గావించారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి వైభవంగా సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనక దుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో గురువారం అర్చకులు అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో అర్చన, హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర పూజలు నిర్వహించారు. అర్చకులు పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ పాల్గొన్నారు.
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
కొత్తగూడెంఅర్బన్: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం విడుదల అయ్యాయి. మొదటి సంవత్సరంలో పరీక్షలకు 4,440 మంది విద్యార్థులు హాజరు కాగా, 3,167 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 71.33 నమోదు కాగా, ఇందులో బాలురు 63.68 శాతం, బాలికలు 77.72 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా 15వ స్థాఽనంలో నిలిచింది. ప్రథమ సంవత్సరం ఒకేషనల్‌కు సంబంధించి 559 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 414 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం జనరల్‌కు సంబంధించి 1,826 మంది పరీక్ష రాయగా, 978 మంది ఉత్తీర్ణత సాధించగా, రాష్ట్ర స్థాయిలో 17వ స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరం ఒకేషనల్‌లో 366 మంది విద్యార్థులు హాజరు కాగా, 256 మంది ఉత్తీర్ణులైయ్యారు. విద్యార్థులు షార్ట్ మెమోలు బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో పొందవచ్చని అధికారులు తెలిపారు. రీకౌంటింగ్ కోసం పేపర్‌కు రూ.100, రీవెరిఫికేషన్ కోసం పేపర్‌కు రూ.800 చొప్పన ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా నిపుణుల ఉచిత కౌన్సెలింగ్ కోసం 14416 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.


