రహదారులపైకి చేరుతుండడంతో ఇక్కట్లు
పట్టించుకోని జీవాల యజమానులు
అవగాహన కల్పించడంలో అధికారుల విఫలం
● అశ్వారావుపేట మండలం నారాయణపురం సమీపాన ఇటీవల ద్విచక్రవాహనంపై స్నేహితుడితో కలిసి వెళ్తున్న కారం దుర్గారావు(32) రహదారిపై గేదెలను ఢీకొట్టడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.
● మణుగూరు పీవీ కాలనీకి చెందిన చింతల ఎల్ల మ్మ(80) గత మంగళవారం ఇల్లెందు వెళ్లడానికి బస్టాండ్‌కు బయలుదేరింది. రహదారిపై పశువులు పోట్లాడుకుంటూ ఎల్లమ్మపై పడడంతో తీవ్రగాయాలతో కన్నుమూసింది.
చుంచుపల్లి: రహదారులపై మూగజీవాల సంచారం నానాటికీ పెరుగుతోంది. పగలు, రాత్రి తేడా లేకుండా గుంపులుగా తిష్ట వేస్తున్న పశువులు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కొందరు యజమానులు పట్టింపు లేకుండా వాటిని మేత కోసం వదిలిపెడుతుండడంతో అవి రోడ్లపైకి చేరి వాహనదారుల ప్రానాలను బలిగొంటున్నాయి. పల్లెల్లో కాస్త నియంత్రణలో ఉన్నా పట్టణాల్లో పరిస్థితి తీవ్రత పెరుగుతోంది. పశువుల సంచారంపై పంచాయతీ, మండల స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించడం లేదని జనం మండిపడుతున్నారు. అయితే, కొన్నిచోట్ల పశువులు రహదారులపై బైఠాయిస్తుండగా, ఇంకొన్ని చోట్ల పరిగెత్తి వస్తుండడంతో ఏం ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు.
చర్యలు కరువు...
మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలో పశువుల సమస్యను అరికట్టడానికి కఠిన నిబంధనలు అమలు చేయాల్సి ఉంది. పశువులు రోడ్లపైకి వస్తే మొదటి తప్పుగా రూ.వేయి నుంచి రూ.5వేల వరకు యజమానులకు జరిమానా విధించొచ్చు. యజమానుల నిర్లక్ష్యంతో ప్రాణనష్టం జరిగితే క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశముంది. కానీ ఉమ్మడి జిల్లాలో ఈ నిబంధనలను అమలు చేస్తున్న దాఖలాలు ఎక్కడా లేవు. అంతేకాక పశువుల వల్ల జరుగుతున్న ప్రమాదాలపై యజమానులకు అవగాహన కూడా కల్పించకపోవడం గమనార్హం.
రోడ్లే ఆవాసం
గ్రామీణ రహదారుల్లోనే కాక పట్టణాలు, నగరాల్లో ప్రధాన రహదారుల్లో కూడా పశువులు తిష్ట వేస్తున్నాయి. హోటళ్లలో యజమానులు పడేసే ఆహారం, కూరగాయలు తింటుండగా.. ఇంకొందరు భక్తితో పెట్టే బియ్యం, అన్నం, పండ్లు తింటూ కాలం గడుపుతున్నాయి. కొన్నింటిని యజమానులే మేత కోసం వదులుతుండగా.., ఇంకొన్ని పశువులు ఎవరివో తెలియని పరిస్థితి నెలకొంది. మరికొందరు యజమానులు పశువులకు మేత పెట్టలేక రోడ్లపైకి వదిలేస్తుండడంతో వాహనదారులకు శాపంగా మారుతోంది. వీటి కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతుండగా, మరికొందరు గాయాల పాలవుతున్నారు. ఇక కొన్ని ఘటనల్లో మూగజీవాలు సైతం గాయపడుతున్నాయి. ఇక రాత్రి పూట సమీపానికి వెళ్లే వరకు గేదెలు కానరాక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
యజమానులు ఇస్టారాజ్యంగా పశువులను రహదారులపైకి వదిలేస్తున్నారని తెలిసింది. దీని వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొన్ని చోట్ల ఆవులు, గేదెలు గుంపులు,గుంపులుగా తిష్ట చేయటమే కాకుండా వచ్చిపోయే ప్రజలు, వాహనదారులపై దాడులకు దిగుతున్నాయి. దీని విషయంలో పశువుల యజమానులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. లేని పక్షంలో జరిమానాలతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇస్తాం.
– ఎం.విద్యాచందన, డీపీఓ


