పాల్వంచరూరల్: అక్రమ క్వారీల నిర్వహణకు అడ్డుకట్ట వేసేందుకు మైనింగ్, పోలీసుశాఖ అధికారులు గత మే 21న రెండు చోట్ల కందకాలు తవ్వితే.. ఒక చోట క్వారీల నిర్వాహకులు పూడ్చివేశారు. క్వారీలో బండరాళ్లను పగులగొట్టి క్రషర్లకు తరలిస్తున్నారు. మండల పరిధిలోని తోగ్గూడెంలో ఒక్క క్వారీకి మాత్రమే మైనింగ్ శాఖ అనుమతులు ఇచ్చింది. మిగిలిన ఐదు క్వారీలకు అనుమతులేవు. నిర్వాహకులు అనుమతులు లేకుండా క్వారీల్లో పేలుడు పదార్థాలను వినియోగించి పెద్దపెద్ద బండరాళ్లను బ్లాస్టింగ్ చేసి, క్రషర్ మిల్లులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అయినా అధికారుల పట్టించుకోవడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం క్వారీల తనిఖీ కోసం విజిలెన్స్ అధికారులు వస్తున్నట్లు ప్రచారం జరగడంతో అక్రమ క్వారీ నిర్వహణ పనులను నిలిపివేశారు. కాగా తోగ్గూడెంలోని పాత క్వారీలకు అనుమతులు రావని తెలిసి క్వారీల నిర్వాహకులు నూతన క్వారీల నిర్మాణం కోసం ముగ్గురు గిరిజనుల పేరుతో రెవెన్యూ, మైనింగ్ శాఖలకు దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమ క్వారీలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


