● సింగరేణి గ్యాస్ గోడౌన్ వద్ద బారులు
మణుగూరురూరల్: గ్యాస్ కోసం వినియోగదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మండలంలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద డీలర్లు నో స్టాక్ (గ్యాస్ లేదు) అంటూ బోర్డు ఉంచడంతో వినియోగదారుల్లో కలకలం రేగింది. గ్యాస్ సిలిండర్ల కోసం వచ్చిన వినియోగదారులంతా ఈ బోర్డును చూసి నిరాశకు గురై వెనుదిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ కొరత లేదని చెబుతున్నప్పటికీ.. మణుగూరు గ్యాస్ ఏజెన్సీ నో స్టాక్ బోర్డు పెట్టడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. గ్యాస్ సరఫరాలో నిజంగా అంతరాయం ఏర్పడిందా..? లేదా కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా.? అన్న సందేహాలు వినియోగదారుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జిల్లాలోని పలు ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్న వారిపై అధికారులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మణుగూరులో గ్యాస్ అందుబాటులో లేకపోవడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఇండియన్ ఏజెన్సీ యాజమాన్య తీరుపై వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి క్యూలో నిలబడితే చివరకు నో స్టాక్ అని చెప్పడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఖాళీ సిలిండర్లతో..
రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ.. సోషల్ మీడియాల్లో గ్యాస్ కొరత ఉందంటూ ప్రచారం అవుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెంది మంగళవారం గ్యాస్ గోడౌన్ల వద్ద బారులుదీరారు. మణుగూరు ఏరియాలోని సింగరేణి గ్యాస్ గోడౌన్ వద్ద కూడా వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో క్యూలో గంటల కొద్ది నిరీక్షిస్తూ అవస్థలు పడుతున్నారు. కొందరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుని ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకుంటుండగా.. మరికొందరు గ్యాస్ కోసం తమ విధులను మానుకొని గోడౌన్‌కు చేరుకుని అవస్థలు పడుతున్నారు. గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా ఉన్నతాధికారులు, ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని వినియోగదారులు, ప్రజలు కోరుతున్నారు.


