విభజనపై నీలినీడలు ! | - | Sakshi
Sakshi News home page

విభజనపై నీలినీడలు !

Mar 2 2026 7:44 AM | Updated on Mar 2 2026 7:44 AM

విభజనపై నీలినీడలు !

విభజనపై నీలినీడలు !

ఆటంకంగా మారిన

‘నాబార్డ్‌’ ప్రామాణికాలు

ఉమ్మడి జిల్లాలో 58 కొత్త సంఘాలకు ప్రతిపాదనలు

4–5 సొసైటీల ఏర్పాటుకే అవకాశం ?

ఖమ్మంవ్యవసాయం: నూతన సహకార సంఘాల ఏర్పాటు మూడడుగులు ముందుకు, ఆరడుగులు వెనక్కు అన్న చందంగా మారింది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పెద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం ఏడాది క్రితం నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపించాలని జిల్లాల సహకార అధికారులను ఆదేశించింది. దీంతో జిల్లాలో పెద్ద సంఘాలను గుర్తించి... వాటిని ఒకటి నుంచి మూడు సంఘాల వరకు విభజించాలంటూ 2025 జనవరిలో జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 906 సహకార సంఘాలు ఉండగా, మరో 345 నూతన సంఘాల ఏర్పాటుకు అన్ని జిల్లాల నుంచి ప్రతిపాదనలు అందాయి. అయితే సహకార బ్యాంకు, సహకార సంఘాలకు వెన్నుదన్నుగా ఉండే నాబార్డ్‌(నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలెప్‌మెంట్‌) ఈ నూతన సంఘాల ప్రతిపాదనలను పరిశీలించి, ఏర్పాటుకు గల అర్హతలపై అధ్యయనం చేసింది. సంఘాల ఆదాయం, ఉద్యోగుల వేతనాల వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకొని కొత్త సంఘాల ఏర్పాటు కంటే ప్రస్తుతం ఉన్న సంఘాలను బలోపేతం చేయడమే మేలని స్పష్టం చేసింది. నాబార్డ్‌ సూచించిన అర్హతల ఆధారంగా రాష్ట్రంలో 12 నూతన సంఘాల ఏర్పాటుకు మాత్రమే అవకాశం ఉంది.

భారీగా ప్రతిపాదనలు..

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు మహబూబాబాద్‌ జిల్లాలోని గార్ల, బయ్యారం, ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం సహకార సంఘాలు ఉన్నాయి. మొత్తంగా 101 సహకార సంఘాలు పాత ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్నాయి. ఇందులో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 76, భద్రాద్రి జిల్లాలో 21, బయ్యారం, గార్ల, వాజేడు, వెంకటాపురంలో నాలుగు పీఏసీఎస్‌లు ఉన్నాయి. అయితే ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని నూతన మండలాల్లో కొత్తగా, పెద్ద సహకార సంఘాలను గుర్తించి ఇంకొన్ని కలిపి 58 పీఏసీఎస్‌లు ఏర్పాటు చేయాలని రెండు జిల్లాల సహకార శాఖలు నిర్ణయించాయి. ఖమ్మం జిల్లాలో 39, భద్రాద్రి జిల్లాలో 19 సంఘాల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదించారు.

ఎక్కడెక్కడ అంటే..

ఖమ్మం జిల్లాలో వీవీ పాలెం సొసైటీ నుంచి అల్లీపురం, వేపకుంట్ల, మంచుకొండ సొసైటీ నుంచి ఈర్లపుడి, టేకులపల్లి ఏపీఎఫ్‌ఎస్‌సీఎస్‌ నుంచి గువ్వలగూడెం, మద్దులపల్లి, ఏదులాపురం సొసైటీ నుంచి గోళ్లపాడు, ఎం.వెంకటాయపాలెం, తల్లంపాడు, కల్లూరుగూడెం సొసైటీ నుంచి పెరికసింగారం, పాలేరు, నేలకొండపల్లి నుంచి అప్పలనర్సింహాపురం, తిరుమలాయపాలెం నుంచి పిండిప్రోలు, జల్లేపల్లి, బీరోలు నుంచి కాకరవాయి, సుబ్లేడు సొసైటీలను కొత్తగా ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. అలాగే చింతకాని పీఏసీఎస్‌ నుంచి పందిళ్లపల్లి, నాగిలిగొండ, నాగులవంచ నుంచి పాతర్లపాడు, ముదిగొండ నుంచి బాణాపురం, వనంవారి కిష్టాపురం, మధిర నుంచి సిరిపురం, మడుపల్లి, కాకర్లపల్లి నుంచి బుగ్గపాడు, కల్లూరు నుంచి ముచ్చవరం, చెన్నూరు నుంచి చండ్రుపట్ల, తల్లాడ నుంచి బిల్లుపాడు, కారాయిగూడెం నుంచి కుప్పెనకుంట్ల, పెనుబల్లి నుంచి లంకపల్లి, టేకులపల్లి ఏర్పాటు చేయాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. అంతేకాక కేజీ మల్లెల నుంచి అడసర్లపాడు, గార్లొడ్డు నుంచి నాచారం, తిమ్మారావుపేట, కారేపల్లి నుంచి కోమట్లగూడెం, గోపవరం నుంచి పల్లిపాడు, పెద్దగోపతి, వైరా నుంచి గొల్లపూడి, గన్నవరం, గరికపాడు నుంచి విప్పలమడక, కామేపల్లి నుంచి కొత్త లింగాలను నూతన సంఘాలుగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇక భద్రాద్రి జిల్లాలో జూలూరుపాడు నుంచి పడమటి నర్సాపురం, గుంపెన నుంచి అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, దమ్మపేట నుంచి నాచారం, గండుగులపల్లి, ముల్కలపల్లి నుంచి జగన్నాథపురం, పొగళ్లపల్లి, పూసుగూడెం, అశ్వాపురం నుంచి మిట్టగూడెం, గుండాల నుంచి ఆళ్లపల్లి, బూర్గంపాడు నుంచి మోరంపల్లి బంజర, పినపాక నుంచి కరకగూడెం, దుమ్ముగూడెం నుంచి నర్సాపురం, బేతంపూడి నుంచి బోడు, కోయగూడెం, బొమ్మనపల్లి, పాల్వంచ నుంచి యానంబైలు, కొత్తగూడెం నుంచి లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్‌లో నూతన సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనల్లో పొందుపరిచారు.

అన్నీ కాదు కొన్నే..

నాబార్డ్‌ నిర్దేశించిన అర్హతల ఆధారంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 4 నుంచి 5 నూతన సహకార సంఘాలు మాత్రమే ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నట్లు సహకార శాఖలో చర్చ జరుగుతోంది. సంఘాల ఆదాయం, వ్యాపారం, ఉద్యోగుల వేతనాల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఖమ్మం జిల్లాలో ఒకే ఒక్క సహకార సంఘం(టేకులపల్లి నుంచి గువ్వలగూడెం), భద్రాద్రి జిల్లాలో నాలుగు నూతన సంఘాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నట్లు బావిస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో నూతన మండలాలను ఏర్పాటు చేయడంతో ఆ ప్రామాణికంగా నూతన సహకార సంఘాలు ఏర్పాటయ్యే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. అంతేగాక ఏజెన్సీ ప్రాంతంగా కొంత మేరకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం నాబార్డ్‌తో మాట్లాడి అర్హతల విషయంలో సడలింపులు చేస్తే నూతన సహకార సంఘాల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా గ్రామాల్లో కొందరు రాజకీయ నాయకులు నూతన సహకార సంఘాల పదవులపై కన్నేసి వాటి ఏర్పాటుకు ఎదురుచూస్తుండటం గమనార్హం.

ఖమ్మంలోని డీసీసీబీ కార్యాలయం

నూతన పీఏసీఎస్‌ల

ఏర్పాటుపై సందిగ్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement