బలి పశువులు..
కఠిన చర్యలు తీసుకుంటాం
చెక్‌పోస్టుల వద్ద ‘మామూళ్ల’మత్తు?
అడ్డూ అదుపులేని ‘పశు’రవాణా
● ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మారుమూల గ్రామాల నుంచి యథేచ్ఛగా తరలింపు ● భద్రాచలం, మణుగూరు మీదుగా హైదరాబాద్‌కు.. ● పోలీసులను తప్పించుకునేందుకు ఎస్కార్ట్‌ల పహారా ● రెండు రోజుల్లో 100 పశువుల స్వాధీనం
భద్రాచలంటౌన్/మణుగూరురూరల్: అవసరం ఉన్నంతవరకు పనులు చేయించుకుని, చివరి దశలో విక్రయిస్తున్న రైతులు ఒకవైపు.. ఇతరత్రా అవసరాల నిమిత్తం అమ్ముతున్నవారు మరోవైపు.. వెరసి పశువుల అక్రమ రవాణా తీవ్రరూపం దాల్చింది. సరిహద్దు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి భారీ వాహనాల్లో పశువులను అమానవీయంగా కుక్కి హైదరాబాద్ వైపు తరలిస్తున్నారు. అంతేకాకుండా మారుమూల ఏజెన్సీ గ్రామాల నుంచి కూడా పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నారు. లారీలు, ట్రాలీ వాహనాల్లో వందలాది పశువులను కుక్కి సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పశువుల అక్రమ రవాణాను నిలువరించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నప్పటికీ ఫలితం ఉండటం లేదు. పోలీసులను తప్పించుకునేందుకు పశువులను తరలించే లారీలకు ముందు కార్లను ఎస్కార్ట్‌లా నడిపిస్తూ చెక్‌పోస్టుల సమాచారం చేరవేస్తున్నారని తెలుస్తోంది. అధికారులు తనిఖీలు నిర్వహించేలోపే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 17న భద్రాచలంలో కంటైనర్ ముందు వెళ్తున్న కారులో ఉన్న ఐదుగురు వ్యకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ విషయం బయటపడింది. అలాగే, మణుగూరు, కరకగూడెం, అశ్వాపురం, బూర్గంపాడు ప్రాంతాల్లోనూ పశువులను రవాణా చేస్తున్నవారు పోలీసులకు పట్టుబడిన ఘటనలున్నాయి.
సరిహద్దు దాటుతున్నాయి..
పక్క రాష్ట్రాల్లో తక్కువ ధరకే పశువులను కొనుగోలు చేసి భద్రాచలం మీదుగా హైదరాబాద్ సహా ఇతర నగరాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకే వాహనంలో పరిమితికి మించి పశువులను కుక్కి తరలించడం జంతు సంరక్షణ చట్టాలకు విరుద్ధమని జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో రెండు రోజుల్లోనే 100 పశువులను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు ఉపయోగించిన వాహనాలను సీజ్ చేసి, సంబంధీకులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఈ అక్రమ రవాణా వెనుక కొందరు బడా వ్యాపారుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మారుమూల ప్రాంతాలను ఎంచుకుని పశువులను గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేసేందుకు ఓ వ్యవస్థ పనిచేస్తోందని విశ్వసనీయ సమాచారం.
పశువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటాం. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో కట్టుదిట్టమైన తనిఖీలు కొనసాగిస్తున్నాం. రెండు రోజుల్లోనే 100కు పైగా పశువులను రక్షించి కేసులు నమోదు చేశాం. పోలీసులను తప్పించుకునేందుకు ఎస్కార్ట్ వాహనాలు వినియోగిస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమ రవాణా వెనుక ఉన్న సూత్రధారులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
– నాగరాజు, సీఐ, భద్రాచలం
ప్రతి రోజూ వందల సంఖ్యలో పశువులు తరలిపోతున్నా, చెక్‌పోస్టుల వద్ద కఠిన తనిఖీలు జరగకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కొందరు సిబ్బంది మామూళ్లకు అలవాటు పడి అక్రమార్కులకు సహకరిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడూ కేసులు నమోదు చేస్తు న్నా, అవి కేవలం కంటితుడుపు చర్యలేనని స్థానికులు వాపోతున్నారు. చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాల వద్ద నిరంతర నిఘాను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. పశువుల అక్రమ రవాణాపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
బలి పశువులు..


