రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజ లు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆ తర్వాత స్వామివారికి కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ ధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
నిత్యాన్నదానానికి విరాళం
శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే నిత్యాన్నదాన కార్యక్రమానికి ఖమ్మానికి చెందిన శీలం లలిత రూ.లక్ష ఆలయ అధికారుల కు అందజేయగా పర్యవేక్షకులు లింగాల సాయిబాబా రశీదు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
4న స్వర్ణ లక్ష్మీ అమ్మవారి పూజ
మార్చి 4వ తేదీన శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయంలో స్వర్ణ లక్ష్మీ అమ్మవారి పూజా మహోత్సవం జరపనున్నట్లు ఈఓ దామోదర్ రావు తెలిపారు. ఈ పూజలలో పాల్గొనే భక్తులు రూ.600 చెల్లిస్తే అమ్మవారి వెండి ప్రతిమ, జాకెట్ పీసు, ప్రసాదం అందజేస్తామని పేర్కొన్నారు. అలాగే 3, 4 తేదీల్లో నిత్యకల్యాణాలను రద్దు చేశామని వెల్లడించారు.
నేడు ఏఈ అభ్యర్థులకు రాతపరీక్ష
రుద్రంపూర్: సింగరేణిలో ఖాళీగా ఉన్న నాలుగు అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ గ్రేడ్–2(ఇంటర్నల్) ఉద్యోగాల భర్తీకి ఆదివారం రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఈమేరకు దరఖాస్తు చేసుకున్న 126 మందికి హాల్‌టికెట్లు జారీ చేశారు. పరీక్ష కొత్తగూడెంలోని సింగరేణి మహిళా కళాశాలలో జరగనుందని రిక్రూట్‌మెంట్ సెల్ జీఎం మురళీధర్‌రావు తెలిపారు. పూర్తిగా ఆన్‌లైన్‌లో విధానంలో పరీక్ష జరగనున్నందున, అభ్యర్థులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.


