గ్రీన్‌ సిగ్నల్‌ | - | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ సిగ్నల్‌

Feb 21 2026 7:14 AM | Updated on Feb 21 2026 7:14 AM

గ్రీన్‌ సిగ్నల్‌

గ్రీన్‌ సిగ్నల్‌

హెవీ లోడ్‌ వాహనాలతో

రోడ్లు ఛిద్రం

పర్యాటకులు,

ఇసుక లారీల కోసం..

ఆదేశాలు జారీ చేసిన

తెలంగాణ హైకోర్టు

వాటర్‌ఫాల్స్‌ రోడ్డులో

రాకపోకలకు అనుమతి

ఒక్కో లారీ నుంచి

రూ.100 పన్ను వసూలు

ఇసుక

లారీలకు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మణుగూరు పట్టణ శివారులో గుట్టమల్లారం నుంచి స్వప్ప వాటర్‌ ఫాల్స్‌ (కట్టుమల్లారం), జాబిల్లి వాటర్‌ఫాల్స్‌ (కట్టుమల్లారం) వరకు ఫారెస్టు శాఖ ఆధీనంలో ఉన్న 7 కిలోమీటర్ల రోడ్డు మీదుగా ఇసుక లారీల రాకపోకలకు అడ్డంకులు కల్పించవద్దంటూ తెలంగాణ హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఫారెస్ట్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌, మణుగూరు డివిజన్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌, మణుగూరు ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌లకు సూచించింది. అటవీ మార్గం గుండా రాకపోకలు సాగించేందుకు ఒక్కో లారీ నుంచి అటవీశాఖ రూ.100 పన్ను వసూలు చేసుకోచ్చంటూ ఆదేశాల్లో పేర్కొంది.

సహజ న్యాయం దక్కేలా

న్యాయస్థానం ఆదేశాలు..

మెస్సర్స్‌ నాగులమ్మ తల్లి మహిళా ట్రైబల్‌ శాండ్‌ క్వారీ లేబర్‌ కాంట్రాక్ట్‌ మ్యూచువల్‌ ఎయిడెడ్‌ కోపరేటివ్‌ సొసైటీకి తెలంగాణ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ల మధ్య 2025 మే 12న ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం నాగులమ్మ గిరిజన మహిళా సొసైటీ గోదావరిలో ఇసుక పూడిక తీత పనులు దక్కించుకుంది. కోడిముత్తయ్య గుంపు స్టాక్‌ పాయింట్‌ నుంచి మణుగూరు ఆర్‌ అండ్‌ బీ రోడ్డు వరకు ఇసుక రవాణా చేసేందుకు కట్టుమల్లారం, కమలాపురం మీదుగా ఫారెస్ట్‌ శాఖ నిర్మించిన వాటర్‌ఫాల్స్‌ రోడ్డు ఒక్కటే అందుబాటులో ఉంది. ఒకే ఒక రోడ్డు అందుబాటులో ఉన్నప్పుడు దాని మీదుగా రాకపోకలు నిషేధించడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని, ఫారెస్టు శాఖ ఇలా చేయడం వల్ల నాగులమ్మ తల్లి మహిళా సొసైటీకి సహజ న్యాయం దక్కేలా న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది.

టీజీఎండీసీ సామాజిక బాధ్యత ఏదీ..?

టీజీఎండీసీ వంటి కార్పొరేట్‌ సంస్థ సామాజిక బాధ్యత కింద ఇసుక ర్యాంపులు ఉన్న గ్రామాల దగ్గర చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఏమీ లేవు. ఆఖరికి ఇసుక లారీల వల్ల దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయడం, విస్తరించడానికి సైతం ముందుకు రావడం లేదు. ఫలితంగా మైనింగ్‌ ప్రాంతాలకు దగ్గరున్న స్థానికుల్లో మెజారిటీ ప్రజానీకం సదరు సహజ వనరుల వల్ల కనీస స్థాయిలో లబ్ధి పొందే మాట అటుంచితే ప్రతీరోజు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో అంబులెన్సులు పోయేందుకు రోడ్లు నిర్మిస్తామంటే నానా కొర్రీలు వేసే అటవీశాఖ ఇసుక రవాణా సాఫీగా సాగేందుకు వీలుగా తమ ఆధీనంలో ఉన్న ఎడ్లబండి దారులను లారీలు రాకపోకలు సాగించేందుకు వీలుగా విస్తరించడం, అభివృద్ధి చేసేందుకు ముందుకు రావడం కొత్త విధానానికి తెర లేపినట్లయింది.

గోదావరి తీరం వెంబడి కోడిముత్తయ్యగుంపు, చిన్నరావిగూడెం, పెద్దరావిగూడెంల దగ్గర ఏళ్ల తరబడి ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ స్టాక్‌ పాయింట్ల నుంచి ఇసుక లోడ్‌ చేసుకున్న లారీలు కట్టుమల్లారం, కమలాపురం గ్రామాల మీదుగా మణుగూరు పట్టణంలోని ఆర్‌ అండ్‌ బీ రోడ్డుకు చేరుకునేవి. హెవీ లోడ్‌ లారీల రాకపోకల కారణంగా కట్టుమల్లారం, కమలాపురం గ్రామాల్లో రోడ్లు ఛిద్రమయ్యాయి. మిషన్‌ భగీరథ పైపులు పగిలిపోయాయి. ఎగిసిపడే దుమ్ముతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్‌ చిక్కులు ఏర్పడి, పిల్లలు పాఠశాలలకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కోడిముత్తయ్యగుంపు– కమలాపురం– కట్టుమల్లారం వరకు రోడ్డును అభివృద్ధి చేసేంత వరకు తమ గ్రామం మీదుగా ఇసుక రాకపోకలు సాగించేందుకు వీలులేదంటూ ఆ గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు.

గుట్టమల్లారం, కట్ట్ముల్లారం, కమలాపురంల మధ్య గతంలో ఎడ్లబండ్లు తిరిగే దారి ఉంది. ఇసుక లారీల వల్ల కట్టుమల్లారం, కమలాపురం గ్రామాల్లో ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో ఇక్కడున్న వాటర్‌ ఫాల్స్‌కు వెళ్లే పర్యాటకులు, ఇసుక లారీల కోసం కట్టుమల్లారం, కమలాపురం దగ్గరున్న రథంగుట్ట రిజర్వ్‌ ఫారెస్టులో మా శాఖ తరఫున రూ.2 లక్షలతో రోడ్డు నిర్మించాం. న్యాయస్థానం, జిల్లా అధికారుల ఆదేశాలతో ఒక్కో లారీ నుంచి రూ.100 వంతున ట్యాక్స్‌ వసూలు చేస్తున్నాం. ఈ ట్యాక్స్‌ కూడా ప్రభుత్వానికే వెళ్తుంది.

– ఉపేందర్‌,

ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌, మణుగూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement