‘పది’పై ప్రత్యేక దృష్టి
సన్నద్ధమవుతున్న విద్యార్థులు
పదో తరగతిలో వందశాతం
ఫలితాల సాధన దిశగా..
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో
ఐటీడీఏ పీఓ పటిష్ట చర్యలు
60 రోజుల కార్యాచరణ
అమలు చేస్తున్న ఉపాధ్యాయులు
ఆశ్రమపాఠశాలలో నెల రోజులు మాకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అర్థంకాని విషయాలపై, సందేహాలను ఉపాధ్యాయులు నివృత్తి చేస్తున్నారు. మంచి మార్కులు సాధిస్తాం.
– ఇర్ప రాకేష్, పదో తరగతి
పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు ఉపయోగకరంగా ఉన్నాయి. చదువులో వెనుకబడినవారికి ఉపాధ్యాయులు శ్రద్ధతో పాఠ్యాంశాలు బోధిస్తున్నారు.
– బచ్చు నాగచైతన్య, పదో తరగతి
ఆశ్రమ పాఠశాలలో వందశాతం ఫలితాలు, ఎక్కువ మంది విద్యార్థులు ఏ గ్రేడ్ సాధించేలా కృషి చేస్తున్నాం. ఐటీడీఏ అందించిన ప్రత్యేక మాడ్యూల్స్ ప్రాక్టీస్ ద్వారా ప్రయత్నం చేస్తున్నాం.
– చందు, హెచ్‌ఎం, కిన్నెరసాని ఆశ్రమ పాఠశాల
పాల్వంచరూరల్: విద్యార్థుల భవితకు తొలిమెట్టుగా భావించే పదో తరగతి పరీక్షలకు కాలం సమీపిస్తోంది. దీంతో విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని చోట్ల ఉపాధ్యాయుల కొరత ఉండగా, డిప్యూటేషన్ పద్ధతిలో సర్దుబాటు చేశారు. నెల రోజులుగా ప్రభుత్వ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ ఆశ్రమాల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వ, గిరిజన విద్యాలయాలు పోటీపడుతున్నాయి.
ఐటీడీఏ పాఠశాలల్లో కార్యాచరణ..
గిరిజన ఆశ్రమ పాఠశాలలల్లో వందశాతం ఉత్తీర్ణతకు ఐటీడీఏ పీఓ రాహుల్ 60 రోజుల కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. మండల పరిధిలోని కిన్నెరసాని గిరిజన క్రీడాపాఠశాల, ఉల్వనూరులోని బాలికల పాఠశాలతోపాటు ఐటీడీఏ పరిధిలోని అన్న ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేశారు. సంబంధిత ఉపాధ్యాయులతో సబ్జెక్టుల వారికి స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు.
వెనుకబడిన విద్యార్థులపై నజర్
వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో గత నాలుగు రోజుల నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సంబంధిత ఆశ్రమ పాఠశాలల హెచ్‌ఎంలు ముందుగా సబ్జెక్ట్‌ల వారీగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక దృష్టి సారించారు. రోజూ ఉదయం 5గంటల నుంచి 7.30 గంటలు, రాత్రి 7.30 గంటలనుంచి 9.30 గంటల వరకు స్టడీ అవర్, సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. కిన్నెరసాని క్రీడాపాఠశాలలో పదో తరగతిలో 39 మంది విద్యార్థులు, ఉల్వనూరు ఆశ్రమ పాఠశాలల్లో 80 మంది విద్యార్థినులు పదో తరగతి అభ్యసిస్తున్నారు.
ప్రత్యేక తరగతుల్లో సబ్జెక్ట్‌ల వారీగా రోజుకో ఉపాధ్యాయుడు బోధన చేపట్టాలని, ఉత్తమ మార్కులు సాధించేలా కృషిచేయాలని పీఓ నిర్దేశించారు. ఆ దిశగా విద్యార్థులు కూడా ప్రిపరేషన్ సాగిస్తున్నా రు. గతేడాది కిన్నెరసాని ఆశ్రమంలో పదో తరగతి లో 98శాతంఉత్తీర్ణత సాధించగా, ఉల్వనూరు బాలి కల ఆశ్రమ పాఠశాలలో 100శాతం ఉత్తీర్ణత సాధించారు. రానున్న పరీక్షల్లో కూడా మెరుగైన ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు శ్రమిస్తున్నారు.
‘పది’పై ప్రత్యేక దృష్టి
‘పది’పై ప్రత్యేక దృష్టి
‘పది’పై ప్రత్యేక దృష్టి


