మక్కలపైనే మక్కువ
మొక్కజొన్న సాగుపై
పలువురు రైతుల ఆసక్తి
జిల్లాలో సాధారణ విస్తీర్ణం 65 వేల ఎకరాలు
ఇప్పటికే 86.30 శాతం పూర్తి
ఇల్లెందు, టేకులపల్లి, గుండాల మండలాల్లో సాగు అధికం
మండలం విస్తీర్ణం(ఎకరాలు)
ఇల్లెందు 16,500
టేకులపల్లి 12,550
గుండాల 7,930
దమ్మపేట 5,965
ఆళ్లపల్లి 3,950
అశ్వారావుపేట 2,631
లక్ష్మీదేవిపల్లి 1,610
ములకలపల్లి 1,565
సూపర్‌బజార్(కొత్తగూడెం): వానాకాలం సీజన్‌లో పత్తి సాగు చేసిన రైతులు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయారు. అకాల వర్షాలకు తోడు చీడపీడలతో పంట దిగుబడి తగ్గడంతో కనీసం పెట్టుబడి ఖర్చులు సైతం రాలేదు. దీంతో యాసంగిలో మొక్కజొన్న వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో యాసంగి సాధారణ విస్తీర్ణం 65వేల ఎకరాలుగా వ్యవసాయాధికారులు అంచనా వేయగా.. అంతకు మించి సాగయ్యే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటికే 56,100 ఎకరాల్లో(86.30 శాతం) సాగు కాగా, ఇంకా పలు మండలాల్లో సాగు పనులు చేపడుతున్నారని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. జిల్లాలో అధికంగా ఇల్లెందు మండలంలో 16,500 ఎకరాలు, టేకులపల్లి మండలంలో 12,550, గుండాల మండలంలో 7,930 ఎకరాలలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలోని కొన్ని మండలాల్లో మొక్కజొన్న సాగు లేదని చూపిస్తున్నా.. ఇప్పటికే ఆయా మండలాల్లో పలువురు రైతులు సాగు చేస్తుండడం గమనార్హం. అంటే నిర్దేశిత లక్ష్యాన్ని దాటే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.
ఎకరాకు 40 క్వింటాళ్ల దిగుబడి..
మొక్కజొన్న పంటకు ఇటీవల చీడపీడలు సోకుతుండడం రైతులకు ఆందోళన కలిగించే విషయమే అయినా.. నివారణ చర్యలపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తే నష్టాలను అధిగమించే అవకాశం ఉంటుంది. వానాకాలం సీజన్‌లో ఎకరానికి 25 క్వింటాళ్ల మేర మొక్కజొన్న దిగుబడి రాగా, యాసంగిలో 40 క్వింటాళ్ల వరకు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. కాగా, వానాకాలంలో క్వింటాకు రూ 2,400 మద్దతు ధర అందించగా యాసంగి సీజన్‌లో మరికొంత పెంచాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
జిల్లాలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగింది. రైతులు తమ ప్రాంతా ల్లోని వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు తీసుకుని సస్యరక్షణ చర్యలు పాటిస్తే దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది.
– వి.బాబూరావు, జిల్లా వ్యవసాయాధికారి
మక్కలపైనే మక్కువ


