ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించడంలో జోనల్ అధికారులు కీలక పాత్ర పోషించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిస్టిక్ సర్వైలెన్స్, అకౌంటింగ్ టీమ్‌లు, జోనల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాచందన మాట్లాడుతూ ప్రతీ జోన్ పరిధిలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను జోనల్ అధికారులు నేరుగా పర్యవేక్షించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల స్థితిగతులు, ఎన్నికల సిబ్బంది నియామకం, ఓటర్లకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేయాలని, ఎలాంటి ఉల్లంఘనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని, శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత జోనల్ అధికారులదేనని స్పష్టం చేశారు. పోలింగ్ రోజున ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రస్తుతం ఏఐ ఆధారిత నకిలీ వీడియోలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నందున అధికారులు అప్రమత్తతతో ప్రతీ అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి శ్రీరామ్ మాట్లాడుతూ.. మద్యం స్వాధీనం చేసుకుంటే వెంటనే ఎకై ్సజ్ శాఖకు అప్పగించాలని అన్నారు. ఏదైనా ఫిర్యాదు అందితే వెంటనే ఆ ప్రదేశానికి చేరుకుని స్పాట్ వెరిఫికేషన్ నిర్వహించి, మొత్తం ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయాలని సూచించారు. మహిళల హ్యాండ్‌బ్యాగ్‌లను మహిళా అధికారులు మాత్రమే తనిఖీ చేయాలని చెప్పారు. పలువురు అధికారుల సందేహాలను మాస్టర్ ట్రైనర్ పూసపాటి సాయికృష్ణ నివృత్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సుధీర్, రాజశేఖర్, ఎంపీడీఓలు శ్రీనివాస్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ విద్యాచందన


