కమనీయం.. రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం నయనానందకరంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆ తర్వాత స్వామివారికి కంకణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, దేవస్థానానికి అనుబంధంగా ఉన్న రంగనాయక ఉపాలయంలో ఫిబ్రవరి 1న రంగనాయక స్వామి తిరుకల్యాణోత్సవం ఉంటుందని ఈఓ తెలిపారు. కల్యాణంలో పాల్గొనే భక్తులు రూ.1,500 చెల్లించాల్సి ఉంటుందని సూచించారు. గురువారం ఆలయ హుండీలను లెక్కించనున్నామని పేర్కొన్నారు.
తలనీలాల సేకరణ.. రూ.1.27కోట్లు
భక్తులు సమర్పించే తలనీలాల సేకరణ టెండర్ అత్యధిక ధర పలికి రికార్డు నెలకొల్పింది. హైదరాబాద్‌కు చెందిన ఎ.పుల్లారెడ్డి రూ.1.27 కోట్లకు దక్కించుకున్నారు. ఫిబ్రవరి 1 నుంచి కాంట్రాక్ట్ ఆయనకు దక్కనుంది.
1న పెద్దమ్మతల్లి ఆలయంలో చండీహోమం
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని పెద్దమ్మతల్లి ఆలయంలో ఫిబ్రవరి 1 ఆదివారం రోజున పౌర్ణమిని పురస్కరించుకుని చండీహోమం నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజనీకుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాల్గొనే భక్తులు రూ.2,516 చెల్లించి గోత్ర నామాలను నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు 63034 08458 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
విద్యార్థులకు వైద్య
పరీక్షలు నిర్వహించాలి
డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్
ములకలపల్లి(అన్నపురెడ్డిపల్లి): ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల విద్యార్థులకు ప్రతీ నెల క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ తుకారం రాథోడ్ అన్నారు. మండలంలోని యర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లల్లో రక్తహీనత నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని, వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. అత్యవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, గర్భిణులను పరీక్షించి, మెరుగైన వైద్యం అవసరమైతే రామవరంలోని ఎంసీహెచ్ సెంటర్‌కు తరలించాలని ఆదేశించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రియాంక, సీహెచ్‌ఓ వాణి, పీహెచ్‌ఎన్ ఎస్తేరు రాణి తదితరలు పాల్గొన్నారు.
కమనీయం.. రామయ్య నిత్యకల్యాణం


